స్కైవే.. నో వే! | No Use With Uppal Elevated Corridor Sky Way | Sakshi
Sakshi News home page

స్కైవే.. నో వే!

Sep 9 2019 10:28 AM | Updated on Sep 9 2019 10:28 AM

No Use With Uppal Elevated Corridor Sky Way - Sakshi

ఉప్పల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్‌ చౌరస్తా నుంచి నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ (స్కైవే) అలంకారప్రాయంగానే మిగలనుందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. 163 జాతీయ రహదారిపై 6.2 కిలోమీటర్ల మార్గంలో నిర్మిస్తున్న ఈ కారిడార్‌ కేవలం 10–20శాతం వాహనాలకే సౌలభ్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు నుంచి నారపల్లి వరకున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా... తీరా చూస్తే కార్యాచరణ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ ప్రాంతంలో శరవేగంగా విస్తరిస్తున్న బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో భాగమయ్యాయి. బోడుప్పల్‌ పరిధిలో 1.30 లక్షల జనాభా, పీర్జాదిగూడ పరిధిలో 1.50 లక్షల జనాభా ఉంది. అయితే ఇంత ప్రాధాన్యమున్న ప్రాంతాలను పలకరించకుండానే స్కైవే నిర్మాణం జరుగుతోంది. ఉప్పల్‌ నుంచి సీపీఆర్‌ఐ నారపల్లి వరకు ఎక్కడా ర్యాంపులు లేకుండా పనులు చేస్తున్నారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

ఇదీ ఉద్దేశం...
ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి నల్ల చెరువు, పీర్జాదిగూడ కమాన్, బోడుప్పల్‌ డిపో, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తా వరకు ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటుంది. వాహనాలు నిత్యం గంటల తరబడి రోడ్లపై నిలిచి పోతుంటాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, ఈవెంట్లు ఉన్నప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదనకు విరుద్ధంగా ఘట్‌కేసర్‌ మీదుగా యాదాద్రితో పాటు నేరుగా హన్మకొండ, వరంగల్‌ వెళ్లే వారికి మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా డిజైన్‌ చేశారు. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఎక్కడా కనెక్టివిటీలు ఇవ్వకపోవడంతో ఈ మార్గ మధ్యలోని బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల ప్రజలకు ఇది నిరుపయోగంగా మారుతుంది. 

పరిస్థితి ఇదీ..  
ఆర్టీసీ బస్సులు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల, నారపల్లి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. నాన్‌స్టాప్‌ బస్సులు మినహా మిగతావన్నీ ప్రతి స్టాప్‌లోనూ ఆగాల్సి ఉంటుంది. ఇక క్యాబ్‌లు సైతం కింది నుంచే వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు స్కైవే ఎక్కే పరిస్థితిలు లేవు. అంటే ఒక్క ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళ్లే వాహనాలు మాత్రమే స్కైవేను వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా గమనిస్తే  కేవలం 10–20 శాతం వాహనాలకు మాత్రమే స్కైవే అనుకూలంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.  

నిర్మాణం ఇలా....  
అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. 6.2 కిలోమీటర్ల మేర 148 పిల్లర్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఆరు లైన్ల స్కైవే. 2018 జూలైలో  పనులకు శ్రీకారం చుట్టగా... 2020 జూన్‌ వరకు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉప్పల్‌ ఎలక్ట్రికల్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమయ్యే కారిడార్‌ నారపల్లి సీపీఆర్‌ఐ వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.707 కోట్లు. ఇప్పటికే 52 పిల్లర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నల్ల చెరువుపై ఆరు పోర్టల్‌ బీమ్‌లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏం ప్రయోజనం?   
స్కైవే ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తున్నాం. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందనుకున్నాం. కానీ ర్యాంపులు లేవని మీరు చెబితేనే తెలిసింది. ఇక ర్యాంపులు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది. ఇప్పటికే వ్యాపారులు నష్టపోతున్నారు. ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది.          – అమరేందర్‌రావు, బోడుప్పల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement