విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నా, లేకున్నా ప్రస్తుతం అమలవుతున్న కోటా మేరకు తెలంగాణకు విద్యుత్ ఇవ్వాల్సిందేనని దక్షిణ ప్రాంతీయ విద్యుత్ కమిటీ ఏపీజెన్‌కోను ఆదేశించింది.
తెలంగాణకు విద్యుత్ కోటాపై ఏపీజెన్‌కోకు ఎస్‌ఆర్‌పీసీ ఆదేశం
గ్రిడ్ రక్షణకోసం కోటా విధానాన్ని అమలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నా, లేకున్నా ప్రస్తుతం అమలవుతున్న కోటా మేరకు తెలంగాణకు విద్యుత్ ఇవ్వాల్సిందేనని దక్షిణ ప్రాంతీయ విద్యుత్ కమిటీ ఏపీజెన్‌కోను ఆదేశించింది. పీపీఏలు అమల్లో ఉన్నాయా? లేదా? అన్న విషయంతో తమకు సంబంధం లేదని, విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) రక్షణ ముఖ్యమని... జూన్ రెండు వరకు అమల్లో ఉన్న కోటా విధానాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మంగళవారం బెంగళూరులో దక్షిణ ప్రాంతీయ విద్యుత్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) సమావేశం జరిగింది.
ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ట్రాన్స్‌కోల చీఫ్ ఇంజనీర్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ), జాతీయ విద్యుత్ ప్రసార సంస్థ (ఎన్‌ఎల్‌డీసీ) అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయా? లేదా? అన్నది తమ పరిధిలోని అంశం కాదని.. దానిని కేంద్ర విద్యుత్ శాఖ చూసుకుంటుందని, అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాల్సిందేనని ఎస్‌ఆర్‌పీసీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి కొంతకాలంగా ఆగిపోయిన 541 మెగావాట్ల విద్యుత్ కోటాను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడింది. దక్షిణాది రాష్ట్రాల మధ్య గ్రిడ్ సురక్షితంగా ఉండడానికి, ఆయా రాష్ట్రాల విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడానికి దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) బాధ్యత వహిస్తున్న సంగతి తెలిసిందే.
మేం చట్టాన్ని ఉల్లంఘించలేదు..: ‘‘పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేదు. మా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను మేమే వినియోగించుకుంటాం. మేం విభజన చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. - ఏపీ నుంచి భేటీకి హాజరైన చీఫ్ ఇంజనీర్
పీపీఏల రద్దు అధికారం వారికి లేదు: ‘‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకునే అధికారం ఏపీజెన్‌కోకు లేదు. విభజన చట్టం ప్రకారం పీపీఏలు కొనసాగుతాయి. - తెలంగాణ తరఫున భేటీకి హాజరైన అధికారులు