
'రైతు ఆత్మహత్యల పరిహారం పెంచలేం'
రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచబోమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.
- మండలిలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ
- తెల్లరేషన్ కార్డులు తిరోగమనానికి సూచిక
- ప్రజలపై పన్నులు వేయబోం
- జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిని నియమించే యోచన
- ప్రాణహిత-చేవెళ్లపై సభలో కాసేపు గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచబోమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు. గతంలో ఉన్న పరిహారాన్నే కొనసాగిస్తామని చెప్పారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ... ఆత్మహత్యలు ఆపడానికి కృషిచేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు అభివృద్ధికి సూచిక కాదంటూ వాటిని తిరోగమనానికి సూచికగా అభివర్ణించారు. సంక్షేమంపై ఆధారపడకుండా సొంత కాళ్లపై ఆధారపడేలా చేయడమే అభివృద్ధి అని ఈటెల అన్నారు. పన్నులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. భర్తలు వదిలిపెట్టిన వారికి, జోగినీలకు, వికలాంగ సర్టిఫికెట్ లేనివారికి ఎలా పెన్షన్ ఇవ్వాలో ఆలోచిస్తున్నామన్నారు. పెన్షన్లు పెంచామని... సన్నబియ్యం ఇస్తున్నామని ఇలా ప్రభుత్వ కార్యక్రమాలపై ఈటెల ఊదరగొడుతుండగా... ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ జోక్యం చేసుకొని వనరులు పెరిగినందున చేస్తున్నారన్నారు.
1994కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను... 2004 తర్వాత నెరవేర్చినట్లు చెప్పారు. దీనికి ఈటెల స్పందిస్తూ... రాష్ట్రం ఏర్పడిన సమయంలో తనకు, కేసీఆర్‌కు మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇంకా ఎన్నికలు కాలేదు. గెలుస్తామా? లేదా? అన్న సంశయం ఉంది. మెజారిటీ స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. లేకుంటే వద్దు అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ నేత కంటే ప్రభుత్వ నేతగా, బుగ్గ కార్లలో తిరగడం గొప్పగా అనుకోవడంలేదు. ఉద్యమ కాలంలో కంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి’ అని ఈటెల పేర్కొన్నారు. అన్నీ చేస్తామని అనడంలేదనీ... సత్యసాయి బాబాలా ఏదేదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలేదన్నారు. జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమించే ఆలోచన ఉందన్నారు. టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిగతా పార్టీలను బతకనిచ్చేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని తమ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలపై ఎలాంటి వివక్ష చూపడంలేదన్నారు. గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు అక్కడ మోసపోతే ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ కోరగా, దీనిపై కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఇచ్చే ఆలోచన ఉందని ఈటెల చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ చేస్తాం
ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి పూర్తిచేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందన్న నమ్మకంలేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే పరిస్థితి లేదని ఈటెల అన్నారు. ఈ సందర్భంగా కాసేపు గందరగోళం నెలకొంది. పర్యావరణ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమను ఎవరి అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రస్తావించారు. సింగరేణిని విస్తరించే ఆలోచన ఉందని ఈటెల అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే ఉద్దేశం లేదన్నారు. ఎంఐఎం సభ్యుడు రజ్వి, డాక్టర్ కె.నాగేశ్వర్, టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి, రంగారెడ్డి, ప్రభాకర్ మాట్లాడారు.
ముంపు మండలాలపై ఏపీకి జ్ఞానోదయం కావాలి
ఆంధ్రప్రదేశ్‌లో 7 మండలాలను విలీనం చేసిన విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మానవతాకోణంలో జ్ఞానోదయం కావాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచించి, తమకు సంబంధంలేని ఏడు మండలాలపై నిర్ణయం తీసుకోవాల న్నారు. పోలవరం ప్రాజెక్టు 7ముంపు మండలాలకు విద్యుత్, సంక్షేమ కార్యక్రమాల వర్తింపుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులి చ్చారు. ఇప్పటికే ఈ మండలాల విలీనంపై అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని తెలిపారు. ఆ ఏడు మండలాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వమే విద్యుత్, సంక్షేమ పథకాలు ఇతరత్రా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఈటెల చెప్పారు.