దండిగ కదిలె.. గులాబీబండ్లు

Nizamabad TRS Leaders Coming To Pragathi Nivedana Sabha - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగసభకు భారీగా తరలివెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ వద్ద జరగనున్న ఈ సభకు పార్టీ శ్రేణులు, జనాలను తరలిస్తున్నారు. నియోజకవర్గం నుంచి 20 వేల చొప్పున జన సమీకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఒకటిన్నర లక్షల మందిని తరలించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆదివారం జరగనున్న ఈ సభకు శనివారమే ట్రాక్టర్లు బయలుదేరి వెళ్లాయి. వందలాదిగా ట్రాక్టర్లు జిల్లా నుంచి కొంగరకలాన్‌ వైపు దారితీశాయి. అందంగా అలంకరించుకుని 44వ జాతీయ రహదారిపై ఒకదాని వెంట, మరొకటి.. వరుసకట్టాయి. రైతులు, పార్టీ శ్రేణులు ఈ ట్రాక్టర్లలో తరలివెళ్లారు.

కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ వంటి నియోజకవర్గాల  నుంచి తరలివచ్చిన వందలాది ట్రాక్టర్లను భిక్కనూర్‌ వద్ద మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో ట్రాక్ట ర్‌ నడిపి తన నియోజకవర్గం బాల్కొండ నుంచి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, బోధన్‌ లో షకీల్‌ అమేర్‌లు ట్రాక్టర్‌ నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి బయలుదేరిన ట్రాక్టర్లను డిచ్‌పల్లి వద్ద ఎమ్మెల్యే బాజి రెడ్డిగోవర్ధన్, ఎల్లారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బిచ్కుంద నుంచి ట్రాక్టర్లను ఎమ్మెల్యే హన్మంత్‌షిండేలు ప్రారంభించారు. ట్రాక్టర్లలో వెళ్లే వారికి అవసరమైన భోజన, వసతి ఏర్పాట్లు చేసుకున్నారు.

నేడు బస్సులు, ఇతర వాహనాల్లో
వారం రోజులుగా ఈ జనసమీకరణ పైనే దృష్టి సారించారు. శనివారం ట్రాక్టర్లను తరలించిన ఎమ్మెల్యేలు బస్సులు, ఇతర వాహనాల్లో ఆదివారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను సమీకరించారు. జిల్లాలో వాహనాలు అందుబాటులో లేకపోవడం తో జుక్కల్, బాన్సువాడ, బోధన్‌ నేతలు మహారాష్ట్ర, కర్నాటకల్లోని వాహనాలను అద్దెకు తీసుకున్నారు.
 
508 ఆర్టీసీ బస్సులు.. 
జిల్లాలోని దాదాపు అన్ని ఆర్టీసీ బస్సులను ఈ సభకు వినియోగిస్తున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు (ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌–1, –2, బాన్సువాడ, కామారెడ్డి) డిపోల పరిధిలో మొత్తం 670 బస్సులుండగా, మొత్తం 508 ఆర్టీసీ బస్సులలో సభకు జనాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. తొలిసారిగా అద్దె బస్సులను కూడా ఈ అవసరాలకు వినియోగిస్తున్నారు. సభకు బస్సులను పంపాలని జిల్లా ఆర్టీసీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేకంగా సర్క్యూలర్‌ జారీ అయింది. నిజామాబాద్‌ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు 83 బస్సుల చొప్పున బుక్‌ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 93 బస్సులు, కామారెడ్డికి 89 బస్సులు కేటాయించారు. ఇవన్నీ ఆదివారం ఉదయమే బయలుదేరి వెళ్తాయి. జుక్కల్, బాల్కొండ నియోజకవర్గాలకు డిపోలు లేకపోవడంతో బోధన్, బాన్సువాడ డిపోల నుంచి బస్సులను సర్దుబాటు చేస్తున్నారు. ఈ 508 ఆర్టీసీ బస్సులకు చార్జీలు సుమారు రూ.96 లక్షలను టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నగదు రూపంలో ఆర్టీసీకి చెల్లించారు.
 
ఎప్పటికప్పుడు నిఘావర్గాల నివేదికలు.. 
కొంగరకలాన్‌ సభ జనసమీకరణపై రాష్ట్ర ఇంటలిజెన్స్‌ విభాగం ఆరా తీస్తోంది. గత రెండు రోజులుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతోంది. ముఖ్యంగా ఈ సభకు ఎమ్మెల్యేలు ఏ మేరకు జన సమీకరణ చేస్తున్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శనివారం ఎమ్మెల్యేలు ఏయే మండలాల నుంచి ట్రాక్టర్లను తరలించారు. జనాలను ఏ మేరకు తరలించాలనే అంశంపై ఆరా తీశారు.
 
పోలీసుశాఖ రూట్‌మ్యాప్‌లు.. 
సభకు తరలనున్న వాహనాలకు సంబంధించి పోలీసు శాఖ రూట్‌మ్యాప్‌ను విడుదల చేసింది. వాహనాలన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఆయా రూట్లలో వచ్చే వాహ నాలు ఏ వైపు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లాలనే రూట్లను సూచిస్తూ మ్యాప్‌లను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల నుంచి వెళ్లే వాహనాలతో పాటు, ము«థోల్, బాసర వైపు నుంచి వచ్చే వాహనాలు, కోరుట్ల, మెట్‌పల్లిల వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్‌లను ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top