కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!

New revenue law will be in soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త రెవెన్యూచట్టం తీసుకువస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారని, అవసరమైతే మూడు, నాలుగు రోజులు కూర్చొని సభ్యుల సూచనలు, సలహాలతో కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్, హోం, వ్యవసాయ, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం పద్దులను సీఎం తరఫున మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.రెవెన్యూ పద్దులపై ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.

ఇప్పటివరకు 98శాతం రికార్డులను నవీకరించామని తెలిపారు. 68.37 లక్షల ప్రైవేటు ఖాతాలకుగాను 58.48 ఖాతాలకు కొత్త పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలిచ్చినట్లు చెప్పారు. కేవలం 12–13% ఖాతాలపై అభ్యంతరాలుండటంతో పక్కనపెట్టామని, త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల సవరణలో అనుభవదారుల కాలమ్‌లో పేర్లను తొలగించడం ద్వారా భూమిపై ఉన్న హక్కు కోల్పోతున్న రైతుల విషయంలో ఆలోచిస్తామని, మంత్రి చెప్పారు.  

రిజిస్ట్రేషన్‌ శాఖలో మార్పులు... 
రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖను అనుసంధానించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ రోజే మ్యుటేషన్‌కు చర్యలు తీసు కుంటామని, అదే రోజు పాస్‌పుస్తకం, 1బీలో కూడా పేరు చేర్చేలా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. స్లాట్‌ విధానంతో డాక్యుమెంట్ల జారీలో వేగాన్ని పెంచామని, సగటున రోజుకు 43 డాక్యుమెంట్లు నమోదవుతున్నాయని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది రూ.2,046 కోట్ల రాబడి రాగా, ఈసారి ఇప్పటికే రూ.6,012 కోట్ల ఆదాయం లభించిందని, ఇది ఏకంగా 237% అధికమని తెలిపారు.  

భూస్వామ్యవర్గాలకు మేలు కలిగేలా: భట్టి 
తెలంగాణ పోరాటమే భూమి కోసం జరిగింది.అలాంటి భూమిని ప్రస్తుత ప్రభుత్వం జమీందార్, భూస్వామ్యవర్గాలకు కట్టబెట్టేలా భూ రికార్డుల ప్రక్షాళనను చేసిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అనుభవదారుల కాలమ్‌ నుంచి పేర్లు తొలిగించడంతో వారి ఆస్తులపై పేదలు హక్కులు కోల్పోతున్నారని చెప్పారు. భూ రికార్డుల నవీకరణ ఉద్దేశం మంచిదే అయినా.. చేసిన విధానం బాగాలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా ఉదాహరణలు చెబుతుంటే సమయం అయిపోందని స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం కంకణం కట్టుకుంటే.. అడ్డగోలుగా మాట్లాడటం సబబుకాదన్నారు. 

పర్మిట్‌ రూమ్‌లు ఎత్తివేయండి 
పర్మిట్‌ రూమ్‌ల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని భట్టి అన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక జీఓ ద్వారా టానిక్‌ పేరిట కొన్ని బార్లకు అనుమతిచ్చినట్లు తెలిసిందని, అది సరికాదన్నారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పలు డిపోలు, వర్క్‌షాప్‌లను తాకట్టు పెట్టిందని, తాజాగా ఎలక్ట్రానిక్‌ బస్సుల నిర్వహణ ఒప్పందంలోను అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని విచారణ జరపాలన్నారు. పౌరసరఫరాల పద్దుపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పేదోళ్ల కడుపునింపేందుకు ఏడాదిగా రూ.5,413 కోట్ల సబ్సిడీని భరించినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top