రేపే ముహూర్తం

New Panchayat  Sarpanch Sworn In Medak - Sakshi

పాపన్నపేట(మెదక్‌): కొత్త సర్పంచ్‌లు కొలువు దీరేందుకు ఫిబ్రవరి 2వ తేదీ  ముహూర్తం ఖరారయ్యింది. గతేడాది ఆగస్టు 2 నుంచి నేటి వరకు 184 రోజుల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. నేటితో ఈ పాలనకు తెరపడనుంది. ఈ  ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో పంచాయతీ రాజ్‌ చట్టంపై అవగాహన కల్పిస్తు.. వారి విధులు.. అధికారాలు గురించి వివరించేందుకు 11వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి  మెదక్‌  కొత్త జిల్లాగా అవతరించినపుడు మొదట 312 గ్రామంచాయతీలు ఉండేవి.అయితే 500 జనాభా గల గిరిజన తండాలను, మధిర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు 157 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి.

అలాగే ఎనిమిది గ్రామాలు  సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి.  ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.  మొత్తం 4,58,325 ఓటర్లున్నారు. ఇందులో 90 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు.   ఫిబ్రవరి 2న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈమేరకు  అపాయింట్‌మెంట్‌ డే గా నిర్ణయిస్తూ పంచాయతీరాజŒ æశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అతే ఆ రోజు జరిగే సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేస్తారు. ఆరోజు నుంచి 5 ఏళ్ల  పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది.

ఫిబ్రవరి 11 నుంచి శిక్షణ
కొత్త సర్పంచ్‌లకు విధులు, అ«ధికారాలు, బాధ్యతలు తదితర విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ  11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉండనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 3 నుంచి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ ఇస్తారు.

పదవీ స్వీకారానికి ఏర్పాట్లు 
కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేసేందుకు  వారికి ఇప్పటికే  సమాచారం ఇచ్చాం.  2వ తేదీన  ఉదయం స్పెషల్‌ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి చార్జి అప్పగిస్తారు. ఈ మేరకు మినిట్స్‌లో నమోదు చేస్తారు. –హనోక్, డీపీఓ

శిక్షణ మంచి కార్యక్రమం
నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం, సర్పంచ్‌ విధులు, అధికారాలు, గ్రామ సభల ఏర్పాటు, హరితహారం, బాధ్యతలు, ఆదర్శ గ్రామావృద్ధి తదితర విషయాలు, రికార్డుల నిర్వాహణ గురించి ఎక్కువగా తెలియదు. అందు వల్ల సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సంతోషం. –కలాలి నవీన్‌గౌడ్, కొత్త లింగాయపల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top