డెయిరీ సిగలో మరో నగ

New Milk Dairy Centre Karimnagar - Sakshi

కరీంనగర్‌ డెయిరీ కిరీటంలో మరో కలికితురాయిగా నూతన ప్లాంటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న కరీంనగర్‌ డెయిరీ, నూతనంగా మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల మెగా ప్లాంట్‌ను స్థాపించనుంది. తిమ్మాపూర్‌ మండలం నల్గొండ గ్రామంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమ ద్వారా రైతుల సేవలో తరిస్తున్న డెయిరీకి మరో అరుదైన అవకాశం దక్కింది. 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న కరీంనగర్‌ డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్‌కు రూ.63 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.10 కోట్ల సబ్సిడీని సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్రిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద యోజన’ కింద మంజూరు చేశారు. కొత్త ప్లాంటు స్థాపనతో నూతనంగా 500 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా మరెందరికో ఉపాధి కలగనుంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ డెయిరీ పాడి పరిశ్రమాభివృద్ధి ద్వారా తెలంగాణలో క్షీర విప్లవానికి నాంది పలికింది. కరీంనగర్‌ డెయిరీలో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఈ డెయిరీ పాల మార్కెటింగ్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. రెండు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నుంచి మూడు లక్షలకు పెంచేందుకు పాలకవర్గం కృషి చేస్తోంది. ప్రభుత్వం లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకంతోపాటు పాడిపశువుల కొనుగోలుకు పశువుకు రూ.30 వేల సబ్సిడీ పథకం కూడా ప్రకటించి గత సెప్టెంబర్‌ 24 నుంచి అమలు చేస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహం కింద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతేడాది సరాసరి పాలసేకరణ ఆధారంగా రోజుకు 1,47,000 లీటర్లకు లీటరుకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఈ మేరకు రోజుకు రూ.5.88 లక్షలు లబ్ధి కలుగుతుండగా, నెలకు రూ.1,76,40,000 లబ్ధి చేకూరుతోంది.

కరీంనగర్‌ డెయిరీ పరిధిలోని రైతులకు ఈ పథకం ద్వారా రూ.21 కోట్ల 16 లక్షల 80 వేల లబ్ధి వస్తోంది. అదేవిధంగా 70 వేల పాడిరైతులకు పాడిపశువు కొనుగోలుకు ఒక్కో పశువుకు రూ.30 వేల చొప్పున 210 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు కరీంనగర్‌ డెయిరీ పాలకవర్గం కృషి చేస్తోంది. ఇదే సమయంలో రూ.63 కోట్లతో కరీంనగర్‌ డెయిరీ నూతనప్లాంటు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

9 జిల్లాలకు ప్రయోజనం..
70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్న డెయిరీ విస్తరణలో భాగంగా నూతనంగా స్థాపించనున్న ఈ ప్లాంట్‌ ద్వారా తొమ్మిది జిల్లాల రైతులకు  ప్రయోజనం కలగనుంది. సుమారు రూ.63 కోట్ల వ్యయం కానున్న ఈ ప్లాంట్‌ కోసం రూ.10 కోట్లు కేంద్రం సబ్సిడీ అందనుంది. ఈ నూతన ప్లాంటుకు గ్లోబల్‌ అగ్రి సిస్టమ్‌ వారు సాంకేతిక సలహాలు అందించేలా ఒప్పందం జరిగింది. నూతన ప్లాంటుతో 15 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను స్థాపించనున్నారు. వీటి ద్వారా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందనున్నట్లు డెయిరీ వర్గాలు వెల్లడించాయి.

కరీంనగర్‌ డెయిరీ చరిత్రలో మరో అధ్యాయం
నూతన ప్లాంటు ఏర్పాటు తెలంగాణ రైతాంగానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం. నూతన ప్లాంటు కు గ్లోబల్‌ అగ్రి సిస్టమ్‌ వారు సాంకేతిక సలహాలు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాల రైతులు ప్రయోజనం పొందుతారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ కృషి, ప్రయత్నంతో తెలంగాణ రైతాం గానికి, డెయిరీ చరిత్రలో ప్రగతికి మరో ఆధ్యాయం ప్రారంభం     అవుతోంది.   – చలిమెడ రాజేశ్వర్‌రావు, చైర్మన్, కరీంనగర్‌ డెయిరీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top