చెర్రీ బ్లెయిర్‌.. చందా కొచ్చర్‌

The names of 57 industrialists who spoke in the GSE are finalized - Sakshi

జీఈఎస్‌లో మాట్లాడే 57 మంది పారిశ్రామికవేత్తల పేర్లు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)లో జరిగే వివిధ చర్చల్లో ప్రసంగించనున్న 57 మంది పారిశ్రామికవేత్తల పేర్లు ఖరారయ్యాయి. వీరికి సంబంధించిన వివరాలను సదస్సు నిర్వాహకులు విడుదల చేశారు. సదస్సులో మొత్తం 53 చర్చాగోష్ఠులు జరగనున్నాయి.

అయితే అందులో మాట్లాడే వారి తుది జాబితాలు ఇంకా ఖరారు కాలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఖరారైన పేర్లలో 57 మందికి సంబంధించిన నేపథ్యాలను నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, చైర్మన్‌ చందా కొచ్చర్, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య చెర్రీ బ్లెయిర్‌తోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. అందులో కొందరి గురించి..

చెర్రీ బ్లెయిర్‌ – బ్రిటన్‌ మాజీ ప్రధాని సతీమణి
ఈమె ప్రముఖ న్యాయవాది కూడా. పరిశ్రమలను నెలకొల్పడంలో మహిళలకు సహాయం చేసేందుకు 2008లో చెర్రీ బ్లెయిర్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజంలో తమ గొంతను వినిపించగలుగుతారన్న ఆశయంతో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలలు, మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నారు.

చందా కొచ్చర్‌ – ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఎండీ
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐకు ఈమె 2009 నుంచి సీఎండీగా పని చేస్తున్నారు. 1984లో ఐసీఐసీఐలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె... 2001లో బ్యాంక్‌ పాలక మండలిలో స్థానం సంపాదించారు. 2011లో పద్మభూషన్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 153 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆస్తులున్న ఐసీఐసీఐ బ్యాంకుకు లాభాల బాట పట్టిస్తూ ఖ్యాతి గడించారు.     

అను ఆచార్య – సీఈవో, మ్యాప్‌ మై జీనోమ్‌ ఇండియా లిమిటెడ్‌
జన్యు చికిత్స ద్వారా వైద్య సేవలందించేందుకు అను ఆచార్య 2013లో ‘మ్యాప్‌ మై జీనోమ్‌’సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎన్నో పురస్కారాలను గెలుచుకుంది. రెడ్‌ హెర్రింగ్‌ టాప్‌ 100 ఏసియా అండ్‌ గ్లోబల్‌ 2016, ఈఎన్‌–ఏబుల్‌ ఇండియా స్టార్టప్‌ అవార్డ్‌–2016, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ స్టార్టప్‌ షోకేస్‌–2016 ఫైనలిస్ట్‌ పురస్కారాలను సొంతం చేసుకుంది.

భావిష్‌ అగర్వాల్‌ – ఓలా, సీఈఓ, సహ వ్యవస్థాపకుడు
ఐఐటీ ముంబైలో చదివిన భావిష్‌ సహ విద్యార్థి అంకిత్‌ భాటీతో కలిసి ఓలా క్యాబ్స్‌ కంపెనీని 2013 డిసెంబర్‌లో నెలకొల్పారు. అంతకు ముందు రెండేళ్ల పాటు మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో పనిచేశారు. ఓలా షేర్, ఓలా షటిల్‌ సేవలతో రవాణా రంగంలోకి దూసుకువచ్చారు. ఎకనామిక్స్‌ టైమ్స్‌ నుంచి ఎంటర్‌ప్రెన్యూయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2017 పురస్కారం అందుకున్నారు.  

సంజీవ్‌ భిక్చందాని – ‘నౌకరీ’ వ్యవస్థాపకుడు
ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి 1989లో ఎంబీఏ పూర్తి చేసిన సంజీవ్‌ భిక్చందాని ఎన్నో రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన తర్వాత 2003లో ‘నౌకరి డాట్‌ కాం’వెబ్‌సైట్‌ను స్థాపించారు. ఇది ఉద్యోగ సమాచారం అందించే ప్రధాన వెబ్‌సైట్‌గా పేరుగాంచింది. స్టాక్‌ ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన ఈ కంపెనీకి మార్కెట్లో 2 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులున్నాయి.

దీప్‌ కాల్ర – ‘మేక్‌ మై ట్రిప్‌’ వ్యవస్థాపకుడు
ఈయన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ ‘మేక్‌ మై ట్రిప్‌ డాట్‌ కాం’ను 2000లో స్థాపించి కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ చేశారు.  అంతకు ముందు పలు కంపెనీల్లో పనిచేశారు. ఐఏఎంఏఐ, ఇంటర్నెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2010), కేపీఎంజీ నుంచి డిజిటల్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ ఇన్‌ ఇండియా((2012)తో సహా పలు పురస్కారాలను అందుకున్నారు.

సచిన్‌ భన్సల్‌ – ఫ్లిప్‌కార్ట్, సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌
దేశ ఈ–కామర్స్‌ రంగంలో 60 శాతం వాటా కలిగిన ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కంపెనీని స్థాపించిన 2007 నుంచి 2015 వరకు సీఈవోగా, 2016 నుంచి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2016లో ఎన్డీటీవీ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని అందుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top