అరగంటలో వస్తానని..అనంత లోకాలకు...

Municipal DE died in road accident at Khammam district - Sakshi

సెలవు రోజున నాన్నతో కాలక్షేపం చేద్దామనుకుంది ఆ కూతురు. ఆఫీసుకు బయల్దేరుతున్న తండ్రితో అదే మాట చెప్పింది. ‘లేదురా నాన్నా.. పని ఉంది. అది ముగించుకుని త్వరగానే వచ్చేస్తా’నంటూ ఆ బిడ్డను ఊరడించాడు. ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణమయ్యేసరికే ఆలస్యమైంది. చీకటి పడింది. భార్యకు ఫోన్‌ చేసి, ‘‘బాగా ఆకలేస్తోంది... రోటీలు తింటాను... రెడీ చేయి. దారిలో ఉన్నా.. అరగంటలో వస్తాను’’ అని ఫోన్‌ చేసి చెప్పాడు. అరగంట దాటింది. గంట.. రెండు గంటలు. ఆయన రాలేదు. 
ఫోన్‌ స్విచ్చాఫ్‌. 

ఖమ్మం  / రఘునాథపాలెం: మండలంలోని ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రోడ్డులో మంచుకొండ–శివాయిగూడెం మధ్యలో  ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇల్లెందు మున్సిపల్‌ డీఈ వాంగుడోత్‌ భోజ్యా(46) మృతిచెందారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం గమనించారు. ఎస్‌ఐ ఎస్‌ క్రిష్ణ, భోజ్యా కుటుంబీకులు తెలిపిన వివరాలు... 

రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్‌ నివాస సముదాయంలో భోజ్యా కుటుంబం నివసిస్తోంది. ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి బైక్‌పై బయల్దేరారు. మంచుకొండ సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్‌ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కంప చెట్లలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య పద్మ, పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.   

ఏడాది క్రితమే ఇల్లెందుకు...     
కారేపల్లి మండలం భాగ్యనగర్‌ తండాకు చెందిన భోజ్యా,  ఏడాది క్రితమే ఆదిలాబాద్‌ నుంచి బదిలీపై ఇల్లెందు మున్సిపాలిటీకి వచ్చారు. తన ఇద్దరు కుమార్తెలను మంచి పాఠశాలలో చదివించాలనుకున్నారు. పాఠశాలకు, ఇల్లెందుకు అనువుగా ఉన్న రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్‌ నివాస సముదాయంలోని ఇంటిలో ఉంటున్నారు. ఆదివారం రోజున కూడా ఆఫీసుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో, గమ్యానికి చేరకుండానే అనంత లోకానికి వెళ్లిపోయారు. 

దారిలో ఉన్నా.. ఆకలేస్తోంది.. 
‘‘దారిలో ఉన్నాను.. ఆకలేస్తోంది.. రోటీలు చేయి.. అని ఫోన్‌ చేశారు. అరగంటలో వస్తానన్నా రు. అరగంట దాటినా రాలేదు. చూసి.. చూసి.. ఫోన్‌ చేస్తే.. స్విచ్చాఫ్‌. మేమంతా భయపడ్డాం’’ అని, భోజ్యా భార్య చెప్పారు. భోజ్యా కుటుంబీ కులు, బంధువులు కలిసి ఆ రోజు రాత్రంతా ఇల్లెందు నుంచి రఘునాథపాలెం వరకు రహదారి వెంట వెతికారు. జాడ తెలియలేదు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన ముళ్ల చెట్ల చాటున విగతుడిగా కనిపించారు. భార్యాపిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. సెల్‌ ఫోన్‌ పగిలిపోయింది. భోజ్యా దేహంపై తీవ్ర గాయాలున్నాయి. 

బోర్‌ కొడుతోంది డాడీ అన్నా... 
‘‘రాత్రి ఏడు గంటల ప్రాంతంలో డాడీ ఫోన్‌ చేశారు. అప్పుడు నేను మాట్లాడా. డాడీ వస్తున్నావా.. నాకు బోర్‌ కొడుతోంది.. అన్నాను. అరగంటలో ఇంట్లో ఉంటానన్నారు. మళ్లీ ఫోన్‌ చేస్తే మోగలేదు’’– ఏడుస్తూ చెప్పింది భోజ్యా కుమార్తె టీనా. 

కేసు నమోదు 
భోజ్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్‌ఐ క్రిష్ణ తరలించారు. కేసు నమోదు చేశారు. రాత్రివేళ, ఎదు రుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కకు బైక్‌ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగుంటుందని ‘సాక్షి’తో ఎస్సై చెప్పారు. 

ఘన నివాళి 
డీఈ మృతదేహాన్ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,  మున్సిపల్‌ కమిషనర్, తోటి అధికారులు, ఉద్యోగులు, బంధువులు సందర్శించారు. ఘనం గా నివాళులర్పించారు. భోజ్యా తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు భోరున విలపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top