నేతల్లో గుబులు

Muncipal Reservatoins Excitement In Warangal - Sakshi

నాలుగు రోజుల్లో తేలనున్నరిజర్వేషన్లు 

ఆశావహుల్లో టెన్షన్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోలాహలం 

సాక్షి, నర్సంపేట: మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైంది. కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.  ఇప్పటికే ఏ వార్డు రిజర్వేషన్ల పరంగా ఏ కేటగిరికీ ఖరారవుతుందోనని అందరిలో చర్చ మొదలైంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే అధికారులు ఈ నెల 14 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.

కాగా రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌ల అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల అనుమతి కోసం ఆ పార్టీ ఆశావహులు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి నర్సంపేట చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు అవకాశం రాగా వార్డుల వారీగా ఎవరికి రిజర్వేషన్‌ ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేవారు అధినాయకుల అనుమతి పొందినవారు రిజర్వేషన్‌ అనుకూలంగా ఉంటుందో లేదోనని టెన్షన్‌లో ఉన్నారు.

ఈ నెల చివరలో రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మునిసిపాలిటీల్లో వార్డుల విభజన, సరిహద్దులు ఖరారు చేయగా కులాలు, వర్గాల వారీగా ఓటర్ల గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి సారించారు. అయితే తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి అనుకూలిస్తే వారు.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీల ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

రిజర్వేషన్లపై చర్చలు
జిల్లాలోని మూడు మునిసిపాలిటీ పీఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో పరకాల, నర్సంపేట పాతవి కాగా వర్ధన్నపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా, వార్డు కౌన్సిలర్‌ పదవుల రిజర్వేషన్లను మునిసిపల్‌ యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వు చేయబోతున్నారు.

మరో 50 శాతం జనరల్‌ కేటగిరిలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రూరల్‌ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డుల కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా అందులో సగభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు కానున్నాయి. ఏ మునిసిపాలిటీ ఎవరికి రిజర్వేషన్‌ ఖరారవుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు తమతమ అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. 

రిజర్వేషన్లు 14లోపు ఖరారు..
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాలను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వార్డులను ఖరారు చేసిన అధికారులు తుది జాబితా ప్రకటనను మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌కు నివేదించారు. వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ  ఆర్డినెన్స్‌ మేరకు విలీన గ్రామాలను పరిగణ లో కి తీసుకుని వార్డుల విభజనను పూర్తి చేశా రు. కొత్త వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా, తుది ఓటరు జాబితా ఆధారంగా రాష్ట్రం యూనిట్‌గా చైర్‌పర్సన్, మునిసిపల్‌ యూనిట్‌గా వార్డు కౌన్సిలర్‌ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top