ఎమ్మెల్యేకు చేదు అనుభవం

MLA Go Back.. - Sakshi

హామీ నిలబెట్టుకోలేదని  అడ్డుకున్న తొర్మామిడి గ్రామస్తులు

రెండు గంటల పాటు రసాభస

బంట్వారం, వికారాబాద్‌ : మండలంలోని తొర్మామిడిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంçగళవారం వచ్చిన ఎమ్మెల్యే సంజీవరావుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే కారు దిగగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు రసాభసగా సాగింది. ధారూరు సీఐ ఉపేందర్‌ జోక్యంతో కాస్త సద్దుమణిగింది.

గతేడాది తొర్మామిడిలో అన్నాచెల్లెలు అనుకోని ఘటనలో బావిలో పడి మృతి చెందారు. అప్పట్లో ఎమ్మెల్యే సంజీవరావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామస్తుల డిమాండ్‌ మేరకు మృతుల కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాటిచ్చారు. కాని ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజీవరావును ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయన ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విపిపించుకోలేదు. 

సభలోను అదే లొల్లి.. 

ఎట్టకేలకు పోలీసులు సభాస్థలికి ఎమ్మెల్యేను తీసుకువెళ్లారు. కాని అక్కడ మరింత గందరగోళం నెలకొంది. బాధిత కుటుంబానికి సహాయం చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రకటించేవరకు సభ జరుగనివ్వమంటూ రసాభస చేశారు. రూ.ఐదు లక్షలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. డీఎస్పీ శిరీష, ధారూరు, వికారాబాద్‌ సీఐలు ఉపేందర్, వెంకట్రామయ్య దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దారు. 

రూ.లక్ష సహాయం చేస్తా: ఎమ్మెల్యే 

తన వ్యక్తిగత సహాయం కింద బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేస్తానని ఎమ్మెల్యే సంజీవరావు ప్రకటించారు. అప్పట్లో మాట్టిచ్చినవన్నీ ప్రభుత్వపరంగా ఇప్పిస్తానని చెప్పారు. కలెక్టర్‌ సెలవులో ఉన్నారని రాగానే ఆయనతో వివరంగా మాట్లాడుతానని తెలిపారు. అనంతరం ఆయన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, ఎంపీడీఓ కృష్ణకుమారి, స్థానిక సర్పంచ్‌ మొగులయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కే.లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పంది వెంటకయ్య, నాయకులు మల్లారెడ్డి, డాక్టర్‌ నర్సింలు, సంజీవరెడ్డి, బస్వాపూర్‌ నర్సింలు తదితరులు పాల్గొన్నారు 

శిలాఫలకం ధ్వంసం.. 

సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని కొందరు అధికార పార్టీ నాయకులే ధంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి తొర్మామిడి రావాల్సి ఉంది. కాని ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఎమ్మెల్యే సంజీవరావు హాజరైనప్పటికీ అనుకోని ఘటనతో ఆయన కొంత  అసహనానికి గురయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top