సినీ ధరల చెల్లింపు వివాదం పరిష్కరిస్తా

Minister talasani with Film Chambers Representatives - Sakshi

ఫిలిం చాంబర్స్‌ ప్రతినిధులతో మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: క్యూబ్‌/యూఎఫ్‌వో సంస్థల నిర్వాహకులకు, సినీ ఎగ్జిబిటర్లకు ధరల చెల్లింపు వివాదాన్ని ఇరుపక్షాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ రాంమోహన్‌రావు ఆధ్వర్యంలో సౌత్‌ ఇండియా ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ ఫిలిం చాంబర్‌ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్న క్యూబ్‌/యూఎఫ్‌వో సంస్థలు ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 2 నుంచి దక్షిణ భారతదేశంలో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నట్లు వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు, హిందీ సినిమాల పట్ల ఒకలా, హాలీవుడ్‌ చిత్రాల పట్ల మరోలా క్యూబ్‌ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఎగ్జిబిటర్ల స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచితే తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చేలా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చలనచిత్ర పరిశ్రమకు కేసీఆర్‌ హయాంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ సినీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తలసాని వారికి తెలిపారు. సింగిల్‌ విండో విధానం, ఆన్‌లైన్‌ టికెటింగ్, పరిశ్రమలోని కార్మికులకు ఇళ్ల నిర్మాణంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. మంత్రిని కలసిన వారిలో ఫిల్మ్‌ చాంబర్స్‌ అధ్యక్షుడు మురళీమోహన్, సౌత్‌ ఇండియా నిర్మాతల సంఘం కార్యదర్శి సి.కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్‌ అధ్యక్షులు జెమిని కిరణ్, దామోదర్‌ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top