నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఇద్దరు ఎంఐఎం నేతలు ఓ టీఆర్‌ఎస్ నేతపై కత్తితో దాడి చేశారు.
చంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఇద్దరు ఎంఐఎం నేతలు ఓ టీఆర్‌ఎస్ నేతపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో టీఆర్‌ఎస్ నేతతో పాటు అడ్డుకోబోయిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చంద్రాయణగుట్ట పరిధిలోని రెహ్మత్‌నగర్ బస్తీ ప్రాంతంలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. దీంతో స్థానిక టీఆర్‌ఎస్ నేత మినాజ్ సిద్దిఖీ తన సొంత డబ్బులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి... బస్తీ వాసులు సరఫరా చేస్తున్నారు.
ఇది గిట్టని ఎంఐఎం స్థానిక నేతలు మహ్మద్ అబ్దుల్ జబ్బార్, పర్వేజ్‌లు బుధవారం సాయంత్రం టీఆర్‌ఎస్ నేత సిద్దిఖీపై కత్తితో దాడి చేయగా కడుపు భాగంలో గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎంఐఎం నేతలను అడ్డుకోబోయిన సిద్దిఖీ అనుచరుడు మీర్ ఖాజర్ అలీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... పోలీసులు కేసు నమోదు చేశారు.