ఆకలి చదువులు

Mid Day Meal Scheme Not Implemented In Govt Colleges Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటిస్తున్నా.. అమలుకు నోచుకోవడంలేదు. జూలైలో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పలు అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ విద్యార్థులతో పాటు డిగ్రీ, డైట్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు గడుస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేకుండా పోయింది. పథకం ఎప్పుడు అమలు చేస్తారో అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవడానికి ఆయా మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. దీంతో మధ్యాహ్న భోజనం కళాశాలలో అందిస్తే రెండుపూటలు కళాశాలలో ఉండి చదువుకునే వీలుంటుంది. కొంతమంది టిఫిన్‌ బాక్సులు తీసుకొస్తుండగా, మరికొంత మంది పస్తులుండి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా మూడు డిగ్రీ కళాశాలలు, ఒక డైట్‌ కళాశాల, ఒక పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్‌లో దాదాపు 5 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో దాదాపు 8 వేల వరకు విద్యార్థులు, పాలిటెక్నిక్‌ కళాశాలలో 2వేల మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ప్రతీ రోజు ఉదయం కళాశాలకు చేరుకోవాల్సి ఉండడంతో అల్పాహారం తీసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం టిఫిన్‌ బాక్సులు సైతం తీసుకురావడానికి సమయం దొరకకపోవడంతో వారు మధ్యాహ్నం పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడంతో అనారోగ్యానికి గురవుతారని వైద్యులు పేర్కొంటున్నారు.

తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య..
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఉదయం పూట హాజరు శాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా మంది విద్యార్థులు ఆకలిని తట్టుకోలేక ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం తగ్గి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపుతోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కొంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పస్తులుండి ఆటలాడుతూ కనిపిస్తుంటారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే సర్కారు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..
గత రెండేళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అమలుకు నోచుకోవడంలేదు. ఇంటి నుంచి కళాశాలకు నడిచిరావడంతో ఉదయం 9 గంటలకే బయల్దేరాల్సి వస్తోంది. దీంతో టిఫిన్‌ బాక్సులు తీసుకురాలేని దుస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఆకలి కారణంగా చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నాం. కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే నాలాంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.– నందన, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఆదిలాబాద్‌ 

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి..
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడంతో టిఫిన్‌ బాక్సు తెచ్చుకోని వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. – జి.లావణ్య, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top