
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఈ శాఖ కమిషనరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో నాగేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
వైద్య సేవల పరంగా ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం 22 ఏళ్లుగా భరోసా కల్పించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కె.యాదానాయక్, సెక్రటరీ జనరల్ కె.బలరాం, వి.విజయవర్ధన్ రాజు, ఎ.కవిత పాల్గొన్నారు.