గద్దెనెక్కిన వరాల తల్లి  | Medaram fair at the international level | Sakshi
Sakshi News home page

గద్దెనెక్కిన వరాల తల్లి 

Feb 2 2018 12:41 AM | Updated on Feb 2 2018 4:48 AM

Medaram fair at the international level - Sakshi

గురువారం మేడారంలోని జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య ఆదివాసీల వడ్డెలు(పూజారులు) సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేర్చారు. గురువారం సాయంత్రం సరిగ్గా 6.14 గంటలకు చిలుకల గుట్ట నుంచి బయల్దేరిన సమ్మక్క.. రాత్రి 8.33 గంటలకు గద్దెపైకి చేరుకుంది. వన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. చిలకలగుట్ట మొత్తం జనంతో కిటకిటలాడింది. అక్కడ్నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. 

ఉదయం నుంచే మొదలు.. 
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం 5.30 గంటలకు చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం నాలుగు గంటలకు చిలకలగుట్టపైకి బయల్దేరారు. సమ్మక్క రాక సందర్భంగా గుట్ట నుంచి గద్దెల వరకు దారి మొత్తం రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నిండిపోయింది. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు ఆడపడుచులు, ముత్తయిదువులు ఆటపాటలతో అలరించారు. మేకలు, కోళ్లు బలిచ్చారు. శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని సమ్మక్కపై వెదజల్లారు. సమ్మక్క రాకకు సూచనగా ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకలగుట్ట నుంచి ఫెన్సింగ్‌ వరకు సమ్మక్క చేరుకునేలోపు మొత్తం నాలుగు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క ఎదురుకోళ్ల పూజామందిరం చేరుకున్న తర్వాత అక్కడ వడ్డెలు, పూజారులు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, తర్వాత కొనసాగించారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. 

సమ్మక్కను దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం 
మేడారం సమ్మక్క తల్లిని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ గురువారం దర్శించుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రమణ్‌సింగ్‌కు ఆహ్వానం పంపింది. గురువారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం 1:00 గంటలకు సమ్మక్క గద్దెకు చేరుకుని కొబ్బరికాయ కొట్టారు. తర్వాత సారలమ్మ గద్దె వద్దకు వెళ్తారని భావించినా అక్కడ్నుంచే వెనుతిరిగారు. అంతకుముందు తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించారు. రమణ్‌సింగ్‌తో ఆ రాష్ట్ర మంత్రులు కేదార్‌ కశ్యప్, మహేష్‌ గగ్డే ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సాయన్న, వివేకానంద, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంబీపూర్‌ రాజులతోపాటు ఏపీ మంత్రి మాణిక్యాలరావు, ఛత్తీస్‌గఢ్‌ ఐజీ వివేకానంద సింహ, బీజాపూర్‌ ఎస్పీ ఎంఆర్‌.అహురి వనదేవతలను దర్శించుకున్నారు. 

ఒక్కరోజే 30 లక్షల మంది 
నలుగురు వన దేవతలు.. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్క రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement