breaking news
Samakka-saralamma Fair
-
గద్దెనెక్కిన వరాల తల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య ఆదివాసీల వడ్డెలు(పూజారులు) సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేర్చారు. గురువారం సాయంత్రం సరిగ్గా 6.14 గంటలకు చిలుకల గుట్ట నుంచి బయల్దేరిన సమ్మక్క.. రాత్రి 8.33 గంటలకు గద్దెపైకి చేరుకుంది. వన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. చిలకలగుట్ట మొత్తం జనంతో కిటకిటలాడింది. అక్కడ్నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. ఉదయం నుంచే మొదలు.. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం 5.30 గంటలకు చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం నాలుగు గంటలకు చిలకలగుట్టపైకి బయల్దేరారు. సమ్మక్క రాక సందర్భంగా గుట్ట నుంచి గద్దెల వరకు దారి మొత్తం రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నిండిపోయింది. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు ఆడపడుచులు, ముత్తయిదువులు ఆటపాటలతో అలరించారు. మేకలు, కోళ్లు బలిచ్చారు. శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని సమ్మక్కపై వెదజల్లారు. సమ్మక్క రాకకు సూచనగా ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకలగుట్ట నుంచి ఫెన్సింగ్ వరకు సమ్మక్క చేరుకునేలోపు మొత్తం నాలుగు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క ఎదురుకోళ్ల పూజామందిరం చేరుకున్న తర్వాత అక్కడ వడ్డెలు, పూజారులు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో విద్యుత్ సరఫరా నిలిపివేసి, తర్వాత కొనసాగించారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్కను దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం మేడారం సమ్మక్క తల్లిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గురువారం దర్శించుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రమణ్‌సింగ్‌కు ఆహ్వానం పంపింది. గురువారం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం 1:00 గంటలకు సమ్మక్క గద్దెకు చేరుకుని కొబ్బరికాయ కొట్టారు. తర్వాత సారలమ్మ గద్దె వద్దకు వెళ్తారని భావించినా అక్కడ్నుంచే వెనుతిరిగారు. అంతకుముందు తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించారు. రమణ్‌సింగ్‌తో ఆ రాష్ట్ర మంత్రులు కేదార్ కశ్యప్, మహేష్ గగ్డే ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సాయన్న, వివేకానంద, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంబీపూర్ రాజులతోపాటు ఏపీ మంత్రి మాణిక్యాలరావు, ఛత్తీస్‌గఢ్ ఐజీ వివేకానంద సింహ, బీజాపూర్ ఎస్పీ ఎంఆర్.అహురి వనదేవతలను దర్శించుకున్నారు. ఒక్కరోజే 30 లక్షల మంది నలుగురు వన దేవతలు.. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్క రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. -
జాతర్లకే అమ్మ మేడారం జాతర
అది శతాబ్దాల నాటి వన జాతర. తరతరాల గిరిజన జాతర. రాచరికపు అహంకారాన్ని, అన్యాయాన్ని ఎదిరించి, జనం కోసం ప్రాణత్యాగం చేసిన అడవిబిడ్డలైన ఆడపడచులను తల్లులుగా భక్తజనకోటి ఆరాధించుకునే అపురూప జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారి కళకళలాడుతూ కన్నుల పండుగ చేసే అద్వితీయ జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా రికార్డులకెక్కిన అరుదైన జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మల జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తల్లీ కూతుళ్లయిన సమ్మక్క సారలమ్మల వీరగాథ కాకతీయుల కాలం నాటిది. అప్పట్లో దండకారణ్యంలోని మేడారంలో కోయగూడెం ఉండేది. ఆ గూడేనికి చెందిన కోయలు ఒకనాడు వేట కోసం అడవిలోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక అడవిలో ఒకచోట పులుల రక్షణ వలయంలో ఉన్న ఒక పసిబిడ్డ కనిపించింది. ఆ మహత్తర దృశ్యం చూసి వారు దిగ్భ్రమ చెందారు. భక్తిపారవశ్యంతో కళ్లు మూసుకుని కొండదేవరకు మొక్కారు. కళ్లు తెరిచి చూసేసరికి పులులు మాయమయ్యాయి. బోసినవ్వులొలికిస్తూ పసిబిడ్డ మాత్రం అక్కడే ఉంది. ఆ పసిబిడ్డను వారు పల్లకిలో గూడేనికి తీసుకొచ్చారు. వెదురు పందిళ్లు వేసి, ఆమెను గద్దె మీద కూర్చుండబెట్టి కొండదేవత కానుకగా కొలవసాగారు. అడవిలోని పెద్దపులులు అప్పుడప్పుడు పసిపాప ఉండే గద్దె వద్దకు వచ్చి బుద్ధిగా సాధుజంతువుల్లా ప్రవర్తించేవి. ఈ అద్భుతాన్ని తిలకించిన గిరిజనులు ఆమెను కొండదేవత అవతారంగా తలచి, సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. ఆమె కొన్ని మహిమలను చూపడంతో సమ్మక్కను గిరిజనులంతా దేవతగా ఆరాధించసాగారు. సమ్మక్క క్రమంగా యుక్తవయసులోకి వచ్చింది. కాకతీయ సామ్రాజ్యంలోని సామంతరాజ్యమైన పోలవాస రాజ్యాన్ని పాలించే మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారు. వివాహం తర్వాత సమ్మక్క, పగిడిద్దరాజు మేడారం ప్రాంతాన్ని సామంతులుగా పాలించడం ప్రారంభించారు. ఏటా క్రమం తప్పకుండా కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించేవారు. సమ్మక్క, పగిడిద్దరాజులకు సారలమ్మ, నాగులమ్మ అనే కూతుళ్లు, జంపన్న అనే కొడుకు పుట్టారు. కొన్నేళ్లు సజావుగానే గడిచాయి. కాలం అనుకూలించక కొన్నేళ్లు వరుసగా కరువు కాటకాలొచ్చాయి. కాకతీయ సేనలపై తిరుగుబాటు వరుస కరువుల వల్ల పగిడిద్దరాజు కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయాడు. ఆగ్రహించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. సమ్మక్క, పగిడిద్దరాజు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. సమ్మక్క, పగిడిద్దరాజు, జంపన్న, పగిడిద్దరాజు సోదరుడైన గోవిందరాజు మేడారం సరిహద్దుగా ఉన్న సంపెంగవాగు దాటకుండా కాకతీయ సైన్యాలను నిలువరించి, వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. యుద్ధం అక్కడితో ముగిసిపోలేదు. కాకతీయ సేనలు మరింతగా వచ్చి, గిరిజన బలగాలపై విరుచుకుపడ్డాయి. యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు ప్రాణాలు కోల్పోయారు. సంపెంగవాగు వద్ద కాకతీయ సేనలను ఎదిరించిన జంపన్న ఆ వాగులోనే పడి వీరమరణం చెందాడు. జంపన్న నెత్తుటితో తడిసిన సంపెంగవాగుకు అప్పటి నుంచి జంపన్నవాగు అనే పేరు స్థిరపడింది. యుద్ధంలో కాకతీయులదే పైచేయి కావడంతో కోయలంతా సమ్మక్క వద్దకు వెళ్లి ‘నీ మహిమలేమైపోయాయి తల్లీ’ అంటూ విలపించారు. వారి బాధకు చలించిపోయిన సమ్మక్క తానే యుద్ధరంగంలోకి దూకింది. సమ్మక్కను ముఖాముఖి ఎదుర్కొనే సాహసం లేని సైనికుడు ఒకరు ఆమెకు బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. ఆమె గాయాన్ని అదిమిపట్టి, ఈశాన్య దిశగా అడవిలో చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెదుకుతూ వెళ్లిన కోయదొరలకు చిలుకలగుట్ట మీద ఒక పెద్ద నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. దానినే సమ్మక్కతల్లి గుర్తుగా భావించారు. తల్లి మళ్లీ అక్కడకు వస్తుందనే ఆశతో కొన్నిరోజులు ఎదురు చూశారు. ప్రతాపరుద్రుడి పశ్చాత్తాపం యుద్ధ వినాశనం తర్వాత కాకతీయుల ఇలవేల్పు ఏకవీరాదేవి ప్రతాపరుద్రుడికి కలలో కనిపించింది. మేడారంలో జరిగిన నాశనాన్ని వివరిస్తూ కంటతడిపెట్టింది. అశేష గిరిజనుల గుండెల్లో దేవతగా కొలువుదీరిన సమ్మక్క, ఆమె కుటుంబం చేసిన ప్రాణత్యాగానికి ప్రతాపరుద్రుడు ఎంతగానో ఆవేదన చెందాడు. కప్పం కోసం తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది, మేడారం చేరుకున్నాడు. జరిగిన దానికి గిరిజనులకు క్షమాపణలు వేడుకుని, మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. సమ్మక్క తల్లి పేరిట రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువుల జాతరగా జరుపుకోవాలని ఆదేశించాడు. అప్పటి నుంచి నెమిలినార చెట్టు కింద పుట్ట వద్ద దొరికిన కుంకుమ భరిణను సమ్మక్క, సారలమ్మలకు ప్రతిరూపంగా పూజిస్తూ గిరిజన జాతరను వైభవోపేతంగా జరుపుకొంటూ వస్తున్నారు. ఇదీ సమ్మక్క, సారలమ్మల గురించి భక్తుల్లో ప్రచారంలో ఉన్న గాథ. మేడారం ఒక జాతరే కాదు... చరిత్ర కూడా! మహాసామ్రాజ్యాల నిర్మాణాలు – చక్రవర్తులు చేసే యుద్ధాలు – ఇవి మాత్రమే చరిత్రలో నమోదవుతాయి. విజయస్తంభాల్లో శాసనాల్లో శిలాక్షరమై మనగ్గలుగుతాయి. ఆ సామ్రాజ్యాల నిర్మాణాల్లో రాళ్లెత్తిన వాళ్లు అనామకులై మట్టిగలిసిపోతారు. యుద్ధాల్లో పరాజితులు చరిత్రహీనులవుతారు. ప్రాణాలు కోల్పోయిన, త్యాగాలు చేసిన వీరులు విస్మృతికి గురవుతారు. కానీ అన్నిసార్లూ అలాగే జరగదు. ప్రజలు తమ జాతి మనుగడ కోసం నిలబడిన వీరులను దైవాల్లా పూజిస్తారు. వాళ్లకు తమ గుండెల్లో ‘గద్దె’ కడతారు. వారి మరణాన్ని ఉన్నతీకరిస్తూ పాటలు కడతారు. గాథలు నిర్మిస్తారు. వీరులకు ఒక్కోసారి అలౌకిక మహిమలను సైతం ఆపాదిస్తారు. అయితే మౌఖికంగా ప్రచారమయ్యే ఆ పాటల్ని, గాథల్ని– వాటిలో, కల్పన కారణంగా – పండిత చరిత్రకారులు అకడమిక్ విలువలు లేని అప్రామాణికాలనీ చరిత్రగా ఒప్పుకోరు. ‘పుక్కిటి పురాణాలు’ అని తిరస్కరిస్తారు. శతాబ్దాలుగా ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచి, యివ్వాళ ఏడెనిమిది రాష్ట్రాల గిరిజన జాతులకు ఆరాధ్య దైవాలుగా కొలువులందుకుంటున్న సమ్మక్క–సారలమ్మల చరిత్రను కూడా అదేవిధంగా అనుమాన దృక్కులతో చూస్తున్నాం. లిఖిత ఆధారాలతోనో, తారీఖులు, దస్తావేజులతోనో చరిత్ర నిర్మించే వాళ్లకు కోయరాజుల చరిత్ర మౌఖికంగా పాడి వినిపించే ‘డోలీ’ల గాథలు అంటరానివి అయ్యాయి. అసలు ‘డోలీ’ అనే కోయ ఉపజాతి కళాకారులు ఇటువంటి పాటలు పాడుతూ తమ జాతి చరిత్ర కాపాడుకొంటూ వస్తున్నారనే చాలామందికి తెలీదు. ఇప్పుడు తొలిసారిగా జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో కోయ చరిత్ర – సంస్కృతుల్ని అధ్యయనం చేయడానికి పూనుకున్న పరిశోధన బృందం దాదాపు పదిహేనేళ్లపాటు అన్వేషించి డోలీలు చెప్పే కోయవీరుల చరిత్రను ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే పుస్తకరూపంలో తెస్తోంది. డోలీలు చెప్పే ఈ కథ రూపంలోనూ, సారంలోనూ అద్భుతమైంది. ఓరుగల్లు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి ‘కరువు కాలంలో కప్పం కట్టం’ – అని తేల్చిచెప్పిన పగిడిద్దరాజు, అతని భార్య సమ్మక్క చేసిన అపూర్వమైన పోరాటాన్ని తరతరాలుగా డోలీలు కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. అయితే ఈ కళాకారులు అంతరించబోయే జాతి అని తెలుసుకోవడమే భయంకర విషాదం. మేడారం జాతరలో నిర్వహించే క్రతుకాండద్వారా యెన్నో ప్రతీకల్లో డోలీలు తమ జాతి చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కథలో ప్రస్తావించే అనేక ప్రదేశాలు – కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు దొరువులు చెట్టుపుట్టా – అన్నీ చరిత్రకు ఆధారాలే. ప్రజలు నిర్మించే చరిత్ర ఎప్పటికైనా సమ్మక్క శౌర్యంలా గద్దెనెక్కి కూర్చుంటుంది. – ఎ.కె.ప్రభాకర్, రచయిత, సాహితీ విమర్శకులు చరిత్రకు ఆధారం... పగిడె చిత్రం! కోయల చరిత్రను దాచి ఉంచినవి పగిడెలు. కోయ పురుషుల చరిత్రను అద్దం పడతాయి. పగిడెలు చూసి కోయవీరుల చరిత్రను గానం చేసే సంప్రదాయం ఉంది. అందుకే ఈ పగిడె చిత్రం కోయల చరిత్రకు పురా ఆధారం అని అంటారు. పగిడె ఒక్కొక్కటి రెండు గజాల నుంచి నాలుగు గజాల పొడవు ఉంటుంది. ఒకవైపు మూడడుగులు, మరోవైపు గజంపైగా వెడల్పు కలిగి ఉంటుంది. ఇది దీర్ఘ త్రికోణాకృతి కలిగి ఉంటుంది. దీనిలో ఆదివాసీల బొమ్మలు వేసి ఉంటాయి. వీటిలో కోయల పుట్టుక, గోత్రాలు, గోత్రపురుషులు, ఇంటిపేర్లు, కోయ దేవరల ప్రాంతీయత తదితర వివరాలు ఉంటాయి. చేసిన పోరాటాలు, మహిమలు, దేవదేవతల వివరాలు కూడిన బొమ్మలు ఉంటాయి. – ప్రొఫ్రెసర్ గూడూరి మనోజ, పాలమూరు విశ్వవిద్యాలయం మేడారం జాతర చారిత్రక మూలాలు పేరంబోయిన రాజు సాంబశివరాజుకు, ఆయన భార్య తూలుముత్తికి నలుగురు కూతుళ్లు. వారిలో సమ్మక్క పెద్దది. చెడాలమ్మ, నాగులమ్మ, కొమ్మాలమ్మలు ఆమె చెల్లెళ్లు. వీరితో కలసి గుంజేటి ముసలమ్మ కూడా కాకతీయ రాజులతో పోరాడుతుంది. పినపాక మండలంలోని సొప్యాల గ్రామంలో ఆమె జాతర జరుగుతుంది. వెదురువనం ధ్వంసం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమ్మక్కను వెదుక్కుంటూ పారెడుగట్టు రాజులు వస్తారు. తమ పెద్ద కొడుకు పగిడిద్దరాజుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. అలా వారి పెళ్లి జరుగుతుంది. ఓరుగల్లు పట్టణం చూసి తిరిగి తాడ్వాయి ప్రాంతం వస్తారు. పగిడిద్దరాజుకు గోవిందరాజు, గడికామయ్య, కొండాయి అనే సోదరులు ఉన్నారు. వరుసగా వర్షాలు పడకపోవడం వల్ల కాకతీయ ప్రతాపరుద్రుడికి రకం (కప్పం) చెల్లించలేకపోతారు. ప్రతాపరుద్రుడు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు చెట్లలో నక్కి ‘మూర్ఛబాణం’ వేయడంతో పగిడిద్దరాజు పడిపోతాడు. ఆ విషయం తెలుసుకుని, ‘బాణాలవరస’ సైన్యంలో ఉన్న సమ్మక్క ఒకవైపు శత్రుమూకలతో తలపడుతూనే వచ్చి, అతడిని తన వీపు మీద వేసుకుని పోతుంది. పోతూ పోతూ యుద్ధం జరిగిన ఊళ్లకు, ప్రదేశాలకు కొత్తగా పేర్లు పెట్టింది. చివరకు నందిమేడారం దగ్గర ఆగి కోయదొరలందరినీ పిలిచి తాను చిలుకూరిగుట్టకు పోయి వస్తానని చెప్పింది. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ధూంధాంగా జాతర జరపాలని చెప్పింది. కోయ వీరనారీమణులను కోయేతరులు కూడా పూజించడం అప్పటి నుంచి ఆచారంగా మారింది. ఇంతవరకు పగిడిద్దరాజు, సమ్మక్కల పుట్టుపూర్వోత్తరాల సమాచారం సాధికారికంగా తెలియదు. అయితే, గిరిజన ప్రజల అధికారిక గాయకులైన డోలీలు, వడ్డెలు, పట్టెడ పూజారులు సమ్మక్క సారక్క జాతర గురించి కొన్ని ఉదంతాలను విడివిడిగా చెప్పారు. డోలీలు అనే కోయతెగ దేవర కొలుపులు చేసేవారు. వారు ‘పోరువీరుల గద్దె మేడారం’ అనే సమ్మక్క సారక్క పోరాటగాథను గానం చేస్తారు. దానివల్ల అక్కడ ఆనాడు జరిగిన యుద్ధ క్రమం, కోయరాజుల వివరాలు తెలుస్తాయి. సమ్మక్క బిడ్డ సారమ్మ. ఈమె తల్లి తరఫున నిలబడి పోరాడింది. ఈమె భర్త సూరే పాపయ్య. తమ్ముడు జంపన్న. వీరి చరిత్రలను వెలికితీయాలంటే, మరో ఆరు కథలను సేకరించాలి. ఎరమరాజు, ముసలమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు వంటి వారికి గల ‘పగిడె’లను విప్పి వారిపై పాడే గాథలను వినాలి. నిజానికి ఇవి కోయ పురాణాలు. వీటిలో ఎన్నో చారిత్రకాంశాలు సంకేతింపబడి ఉన్నాయి. వీటిలో పేర్కొన్న చరిత్రను తవ్వి తీయాల్సి ఉంది. ఏది ఏమైనా సమ్మక్క సారమ్మలు చారిత్రక వ్యక్తులు అని చెప్పవచ్చు. – ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కవి, పరిశోధకులు గద్దె దగ్గర పడుకోబెడితే జబ్బు తగ్గింది నాకు ఏడాది వయసప్పుడు విపరీతంగా జబ్బు చేసింది. ఒళ్లంతా వాపులు వచ్చాయి. తల బాగా ఉబ్బిపోయింది. ‘ఈ పిలగాడు ఇక బతకడు’ అని బంధువులంతా అనుకున్నారట. దిక్కుతోచని పరిస్థితిలో మా అమ్మా నాన్నలు అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మలనే నమ్ముకున్నారు. మేడారం జాతరకు నన్ను 1956లో తీసుకు వెళ్లారు. జంపన్నవాగులో స్నానం చేయించి, నన్ను సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పడుకోబెట్టారు. జాతర తర్వాత నా జబ్బు తగ్గిపోయింది. అప్పటి నుంచి మా అమ్మకు సమ్మక్క సారలమ్మల మీద విపరీతమైన భక్తి ఏర్పడింది. ఆమె ఉన్నన్నాళ్లూ ప్రతిసారీ జాతరకు వెళ్లేవాళ్లం. ఇప్పటికీ అదే ఆనవాయితీ పాటిస్తున్నాం. – ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యాయుడు, నర్సంపేట అవి సమ్మక్క పలుకులే జంపన్న వాగుకు వెళ్లగానే నాకు సమ్మక్క పూనుతుంది. జాతరకు వచ్చిన వాళ్లలో చాలామంది తమ సమస్యలు చెబుతుంటారు. వాళ్లకుబదులిస్తుంటాను. అప్పుడు నా నోట వచ్చేవి నా మాటలు కావు. అవి సమ్మక్క పలుకులే. అవి కచ్చితంగా జరుగుతాయని భక్తుల నమ్మకం. – చింతకుంట్ల నర్సమ్మ, ఏటూరునాగారం ఇలా జరుగుతుంది జాతర సమ్మక్క సారలమ్మల జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటి ఇరవై లక్షల మంది వరకు భక్తులు తరలి రావచ్చని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచే కాకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఈ జాతరకు తండోప తండాలుగా తరలి వస్తారు. మన దేశంలో కుంభమేళా తర్వాత భారీసంఖ్యలో జనం గుమిగూడే వేడుక ఇదే. తొలిరోజు... తొలిరోజు బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొస్తారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరిపి, సాయంత్రం ఆంజనేయస్వామి తోడు రాగా సారలమ్మ మేడారం బయలు దేరుతుంది. ఈసారి జనవరి 31న చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి 8గంటల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మేడారానికి దక్షిణాన ఉన్న అడవిలోకి వెళ్లి, అక్కడ గద్దెలపై ప్రతిష్ఠించే కంకవనాన్ని ఎంపిక చేస్తారు. వేకువ జామున సుమారు మూడు గంటలకు కంకవనానికి పూజలు జరిపి, సూర్యోదయ సమయానికి కంకలను అడవి నుంచి మేడారంలోని గద్దెల మీదకు చేరుస్తారు. రెండోరోజు జాతర రెండోరోజైన గురువారం సాయంత్రం సమ్మక్క ఆగమనానికి గుర్తుగా వేలాది జంతువులను బలి ఇస్తారు. సమ్మక్కకు గౌరవ సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకు తీసుకొచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె (పూజారి) తన్మయత్వంతో ఒక్క ఉదుటన చిలుకల గుట్ట నుంచి మేడారం వైపు పరుగున బయలుదేరుతాడు. సమ్మక్క రాకకు సూచకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి తుపాకులు కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. మూడోరోజు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నలుగురూ గద్దెల మీద ఆసీనులై ఉండే రోజు కావడంతో ఈ రోజు లక్షలాదిగా భక్తులు జాతరకు తరలి వస్తారు. కోర్కెలు తీర్చమని సమ్మక్క, సారలమ్మలను వేడుకుంటారు. కోర్కెలు తీరిన వారు కానుకలు సమర్పించుకుంటారు. వనదేవతలను ఆడపడచులుగా భావించి, పసుపు కుంకుమలు, చీర సారెలు పెట్టి, ఒడి బియ్యం పోస్తారు. మొక్కులు మొక్కుకున్న భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగోరోజు జాతర నాలుగోరోజు శనివారం సాయంత్రం ముగుస్తుంది. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకువెళతారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఈ తతంగమంతా పూర్తవుతుంది. దేవతలను గద్దెల మీదకు చేర్చే సమయంలో రక్షణ కల్పించే విధంగానే, వనప్రవేశం సమయంలోనూ పోలీసులు కట్టుదిట్టమైన రక్షణతో వనదేవతలను సాగనంపుతారు. ఇన్పుట్స్: కృష్ణ గోవింద్, సాక్షి వరంగల్ ప్రతినిధి యాత్రికుల కోసం ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం మేడారం వద్ద హరిత హోటల్‌ను నిర్మిస్తోంది. భక్తుల వసతి కోసం తాత్కాలికంగా లగ్జరీ టెంట్లను అందుబాటులోకి తెచ్చారు. జాతర ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో సెమీ పర్మినెంట్ టాయిలెట్లు, మంచినీరు యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ సంస్థ 53 పాయింట్ల నుంచి దాదాపు నాలుగువేల బస్సులను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి మేడారానికి జాతర రోజుల్లో ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. రైల్వేశాఖ వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, మేరా ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మేరా ఈవెంట్స్, మేడారం జాతర అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
మేడారం..జనసంద్రం
అమ్మలను దర్శించుకున్న 4 లక్షల మంది ములుగు: ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం మేడారానికి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపుర్-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేసి ట్రాఫిక్ నియంత్రింపజేశారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు.