‘మల్లన్నసాగర్‌’ వచ్చేనెల షురూ

Mallanna Sagar Project Work Will Start From February - Sakshi

నేడో రేపో పూర్తి కానున్న భూసేకరణ  

13,970 ఎకరాల్లో మిగిలింది కేవలం 100 ఎకరాలే

ఫిబ్రవరి నుంచి కట్ట నిర్మాణం పనులు మొదలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ కొలిక్కి వచ్చింది. మొత్తం భూసేకరణలో మిగిలి ఉన్న 100 ఎకరాల సేకరణను రెండు, మూడ్రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెల నుంచి పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  13 లక్షల ఆయకట్టుకు నీరు..: మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కింద మెదక్‌ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్నసాగర్‌ నుంచే నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు, నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్‌ నుంచే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 13 లక్షల ఆయకట్టుకు నీరందించనున్నారు.

ఈ భారీ నిర్మాణానికి 13,970 ఎకరాల భూ సేకరణ అవసరమవుతోంది. మూడున్నరేళ్లుగా భూ సేకరణ పనులు జరుగుతున్నా, నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇందులో అత్యంత కీలకంగా వేములఘాట్, తొగిట, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాల్లో భూ సేకరణ జరగక పనులు మొదలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామాల పరిధిలోని నిర్వాసితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వెయ్యి ఎకరాలకు గానూ 900 ఎకరాలను ఎకరం రూ.7.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం మరో 100 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ సేకరణ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్‌ పనులకు సంబంధించి రూ.6,805 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రిజర్వాయర్‌ నిర్మాణంలో ఏకంగా 13 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనుల పూర్తికి రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top