
చకచకా ‘మెట్రో’ నిర్మాణం
మెట్రో రైలు వంతెన నిర్మాణం అద్భుతమని రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు ఎస్‌కే జైన్ కొనియాడారు.
ఉప్పల్, న్యూస్‌లైన్: మెట్రో రైలు వంతెన నిర్మాణం అద్భుతమని రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు ఎస్‌కే జైన్ కొనియాడారు. అతి తక్కువ సమయంలో అతి తక్కువ స్థలంలో అతి పెద్ద, అత్యాధునిక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్‌తో కలిసి శనివారం ఆయన ఉప్పల్‌లో మేట్రో రైలు స్టేషన్, రైల్వే ట్రాక్ తదితర నిర్మాణాలను పరిశీలించారు.
మెట్రో రైలు డిపో నిర్మాణం, పనిచేస్తున్న విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాణం, డిజైన్, అత్యాధునిక సౌకర్యాలతో లే అవుట్ వంటివి అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంతటి పట్టిష్టమైన నిర్మాణం మరెక్కడా కనబడలేదన్నారు. దేశంలోని కట్టడాలకు ఇది మార్గదర్శకంగా రూపొందాలని ఆకాంక్షించారు. మెట్రో వంతెన పనుల్లో కొన్ని న్యాయపరమైన సమస్యలున్నప్పటికీ త్వరలోనే వాటిని అధిగమిస్తామన్నారు.
జూన్‌లో ట్రయల్ రన్...
ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ... ‘నగరంలో మెట్రో రైలు 8 ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ చేయాల్సి ఉంటుంది. ఒత్తిడులకు లొంగనందుకే అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో 80 లక్షల మందికి మేలు జరుగుతుంది. ఈ క్రమంలో కొద్దిమందికి సమస్యలు తప్పవు. జూన్‌లో మెట్రో రైలు ట్రయల్ రన్ ఉంటుంది’ అన్నారు.