మళ్లీ మొదలైన మావోయిస్టుల అలజడి...

Maharashtra And Chhattisgarh Maoist Forces Entered In Peddapalli  - Sakshi

సాక్షి, పెద్దపల్లి : చాలా రోజుల తరువాత మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి నాలుగు దళాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో పోలీసు శాఖ కూంబింగ్‌ చేపట్టింది. డ్రోన్‌ కెమెరాలతో గోదావరి తీరం, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. మావోల కదలికల ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీలో బస చేశారు.  

రాష్ట్రంలోకి నాలుగు దళాలు? 
దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రధానంగా మంథని, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, సిరిసిల్ల నియోజకవర్గాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు. లొంగుబాటు, ఎన్‌కౌంటర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దరిమిలా కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టుల జాడే లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మావో పెద్దలు కూడా ఇతర రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం మన సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనే మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా ఈ రెండు రాష్ట్రాల నుంచి నాలుగు మావోయిస్టు దళాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో మళ్లీ  అలజడి మొదలైంది. దీంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మంథని, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. గోదావరి తీరంలోని మారుమూల ప్రాంతాల్లో రామగుండం సీపీ సత్యనారాయణ స్వయంగా పర్యటించారు. పడవ నడిపేవాళ్లను, గ్రామస్తులను మావోలకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. డ్రోన్‌ కెమెరాల సహాయంతో మావోల కదలికలను అంచనా వేస్తున్నారు.  

ప్రజాప్రతినిధుల అలర్ట్‌! 
నాలుగు మావోయిస్టు దళాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ప్రచారంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధులను పోలీసు శాఖ అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రజాప్రతినిధులకు సంబంధిత పోలీసులు వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు సమాచారం. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పర్యటించొద్దని, తమ కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేస్తూ ఉండాలని ప్రజాప్రతినిధులను అలర్ట్‌ చేసినట్లు వినికిడి.  

ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ  
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం పర్యటించారు. మావోల కదలికల ప్రచారంతో పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు, మావోల నియంత్రణకు భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తిరిగారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పోలీసులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సోమవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీలో డీజీపీ బస చేశారు. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటిస్తారు. కాగా, మావోయిస్టులు నిజంగానే వచ్చారా, వస్తే ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఒకవేళ మావో దళాలు ప్రవేశించడం నిజమే అయితే ఆదిలోనే అణచివేయడంపై పోలీసులు ప్రస్తుతం ఫోకస్‌ పెట్టారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top