భలే గిరాకీ!

liquor Tenders Will Be Held After a Week In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం : ఏపీ మద్యం వ్యాపారుల కన్ను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. అక్కడి ప్రభుత్వం మద్యం నియంత్రణ చర్యలు చేపట్టడంతో ఇటువైపు చూస్తున్నారు. వచ్చే సెప్టెంబరు 30వ తేదీతో ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల గడువు ముగిసిపోనుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మద్యం దుకాణాల టెండర్లు అంటేనే పోటాపోటీగా దరఖాస్తులు వస్తాయి. పాత వ్యాపారులతోపాటు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు సైతం పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు. సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు దాఖలు చేస్తుంటారు. మరో వారం రోజుల తర్వాత చేపట్టనున్న మద్యం టెండర్ల కోసం ఈసారి మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. స్థానిక వ్యాపారులతోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు సైతం ఇక్కడ టెండర్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మద్య నియంత్రణ కోసం గట్టి కృషి జరుగుతోంది. మద్యం కారణంగా చోటుచేసుకునే అనర్థాలను తొలగిం చే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ముందుకు కదులుతోంది. దశలవారీగా మద్యం నిషేధం కోసం ప్రయత్నాలు చేస్తోంది. బెల్ట్‌ దుకాణాలు తొలగించడంతో పాటు ఆ రాష్ట్రంలో దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తూపోతున్నారు.

డీ ఎడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,380 మద్యం దుకాణాలను ఒక్కసారిగా 3,500కు తగ్గించారు. దీంతో ఏపీలోని మద్యం వ్యాపారులు జిల్లావైపు చూస్తున్నారు. అన్నిరకాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఏపీలోని ఈ జిల్లాలవారికి సంబంధాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఆయా సరిహద్దు ఏపీ జిల్లాలవారు ఉత్సా హం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఆబ్కారీశాఖకు ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఈసారి మద్యం దరఖాస్తుకు సంబంధించిన రుసుంను రూ.లక్ష నుంచి రూ.1.5లక్ష లేదా రూ.2లక్షల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోమొత్తం 78 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో 45 దుకాణాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. గత సీజన్‌లో జిల్లాలోని 78 మద్యం దుకాణాల కోసం మొత్తం 2,204 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా రూ.22కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల రుసుము పెంచనుండడంతో పాటు పక్క రాష్ట్రం నుంచి మద్యం వ్యాపారులు వచ్చే అవకాశం ఉండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.  

ఏజెన్సీలో బినామీలే.. 
ఏజెన్సీ పరిధిలోకి వచ్చే మద్యం దుకాణాల విషయంలో అత్యధికం బినామీలే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే మద్యం వ్యాపారులు సైతం ఇక్కడి వ్యాపారులతో సిండికేట్‌గా ఏర్పడి బినామీల ద్వారా దుకాణాల్లో భాగస్వామ్యం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత సీజన్‌లో జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ‘పెసా’ (పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా) గ్రామ సభల విషయంలో సమస్యలు వచ్చాయి. దీంతో భద్రాచలం, సారపాక లాంటి చోట్ల దుకాణాల ఏర్పాటు ప్రాంతాలను మార్చాల్సి వచ్చింది. ఈసారి మాత్రం ముందు గానే ‘పెసా’గ్రామసభలు పూర్తి చేశారు.  గతంలో సారపాక, భద్రాచలంలలో సమస్యలు రావడంతో ఇతర చోట్లకు దుకాణాలను తరలించారు. ఈసారి కూడా వాటిని యథాతథంగా ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగించేందుకు ఆబ్కారీశాఖ నిర్ణయించింది. కొత్త మద్యం టెండర్ల దరఖాస్తుల విషయమై జిల్లా ఎౖక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నరసింహారెడ్డిని సంప్రదించగా.. మరో వారం రోజుల్లో దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే అన్ని ‘పెసా’ గ్రామ సభలు పూర్తయ్యాయని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top