కృష్ణమ్మ సోయగాలు..అపురూప దృశ్యాలు | Launch from Nagarjuna Sagar to Srisailam | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ సోయగాలు..అపురూప దృశ్యాలు

Sep 9 2018 3:03 AM | Updated on Oct 19 2018 7:22 PM

Launch from Nagarjuna Sagar to Srisailam - Sakshi

నాగార్జునసాగర్‌: సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు 110 కిలోమీటర్ల దూరం.. కృష్ణా నదిలో పడవ ప్రయాణం.. తీరం ఇరువైపులా ఎత్తయిన పచ్చని గుట్టలు.. ప్రకృతి రమణీయ అపురూపదృశ్యాలు. ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం. తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మధ్యనుంచి ఆరుగంటల పాటు సాగిన ఈ యాత్రలో లాంచీ కృష్ణానదీ పరవళ్లను చీల్చుకుంటూ ముందుకు సాగింది.  కృష్ణానది నిండుగా ప్రవహిస్తుండటంతో ఈ రెండు పర్యాటక ప్రాంతాలమధ్య శనివారం లాంచీ యాత్ర ప్రారంభమైంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నాగార్జునసాగర్‌ ప్రాంతీయ అధికారి గోపిరవి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర వాటర్‌ప్లూయిట్‌ జనరల్‌ మేనేజర్‌ బాలకృష్ణ, శ్రీశైలం – సాగర్‌ టూర్‌ మేనేజర్‌ సత్యంలు నాగార్జునసాగర్‌లో శనివారం జెండా ఊపి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

మొదటి రోజు 110 మంది పర్యాటకులతో లాంచీ శ్రీశైలం బయలుదేరి వెళ్లింది. ఒకవైపు జింకలు, దుప్పులు ఉండే చాకలికొండ మరో వైపు బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండను చూస్తూ పర్యాటకుల యాత్ర సాగింది. ఇవి దాటగానే జలాశయం మధ్యలో అలనాడు వేలాదిమంది శివ భక్తుల పూజలందుకున్న సింహపురి (ఏలేశ్వరం)గట్టు దర్శనంతో పర్యాటకులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగారు.  నదికి ఇరువైపులా దట్టమైన అమ్రాబాద్, నల్లమల అడవులు, అక్కడక్కడ నదిలోకి దూకే జలపాతాల దృశ్యాలను చూసి ఒళ్లు పులకరించినట్లు పర్యాటకులు  తెలిపారు.  సాయంత్రం ఆరుగంటలకు లింగాల మల్లన్నగట్టు ఒడ్డుకు లాంచీ చేరుకుంది. అక్కడినుంచి రోడ్డుమార్గంలో సాక్షి గణపతి దర్శనం తర్వాత  మల్లికార్జున భ్రమరాంభ ఆలయాలను సందర్శించారు. 

ముందస్తుగానే టికెట్ల బుకింగ్‌: హెదరాబాద్‌ నుంచి సాగర్‌కు వచ్చి నదీమార్గం ద్వారా పలు ప్రాంతాలను సందర్శిస్తూ వెళ్లేందుకు రెండు రోజుల టూర్‌ ప్యాకేజీకి ముందస్తుగానే రెండు.. మూడు ట్రిప్పులకు టికెట్లు బుకింగ్‌ అయినట్లు వాటర్‌ఫ్లూయిట్‌ జనరల్‌ మేనేజర్‌ బాలకృష్ణ, టూర్‌ మేనేజర్‌ సత్యం తెలిపారు. 

టికెట్‌ చార్జీలు ఇలా..
హైదరాబాద్‌నుంచి బస్సులో సాగర్‌కు వచ్చి ఇక్కడి నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్లి రాత్రి అక్కడే బస చేయడం. అక్కడ శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనంతోపాటు పలు ప్రాంతాలను సందర్శించి తిరిగి హైదరాబాద్‌ వెళ్లే వారికి ఒక్కొక్కరికి రూ.3,200 చార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్‌నుంచి శ్రీశైలానికి బస్సులో వచ్చి అక్కడినుంచి నాగార్జునసాగర్‌కు లాంచీ ప్రయాణానికి కూడా ఇదే చార్జీ ఉంటుంది. వీరికి బస ఏర్పాటుతో పాటు భోజన సౌకర్యం కూడా ఉంటుంది.  సాగర్‌నుంచి శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చే వారికి టికె ట్‌ ధర రూ.2,200. ఇవే కాకుండా మరికొన్ని రకా ల ప్యాకేజీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement