
సాక్షి, జనగామ/హన్మకొండ: ‘జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల్లో ప్రజలు మనవైపే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలుచుకొని ఢిల్లీ కుర్చీని శాసించే స్థాయికి ఎదుగుదాం’’అని కార్యకర్తలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. జనగామ, వరంగల్ అర్బన్ పార్టీ జిల్లా కార్యాలయాలకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనగామ, హన్మకొండ సభల్లో కేటీఆర్ మాట్లాడారు. మొన్న మీరు గుద్దిన గుద్దుడుకు కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల వరకు అది లేచే అవకాశం లేదని చెప్పారు. గడ్డాలు తీయాలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్ షా వచ్చినా ప్రజలు బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు రాకుండా చేశారని విమర్శించారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా, రాహుల్, చంద్రబాబు నాయుడు మరో ఆరుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్రమంత్రులు కాలికి బలపం కట్టుకొని తిరిగినా మా నాయకుడు కేసీఆర్ అంటూ ప్రజలు తేల్చారని గుర్తుచేశారు. ఎందరు గుంపులుగుంపులుగా వచ్చినా కేసీఆర్ వైపే మొగ్గుచూపారన్నారు. ఎన్నికల తరువాత పార్లమెంటులో తెలంగాణ పట్ల గౌరవం పెరిగిందన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ, కాకతీయ పథకాలతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుకే ఓ చరిత్ర
టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుకనే ఓ చరిత్రగా మారిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై నాటి బుద్ధిజీవుల్లో ఎన్నో అనుమానాలు ఉండేవని పేర్కొన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత చావు నోట్ల తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించుకుని వచ్చిన ధీరోదత్తుడైన నాయకుడుగా కేసీఆర్ నిలిచారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల ఫార్ములా
రానున్న పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు సిరిసిల్లలో అమలు చేసిన ఫార్ములా ను అమలు చేద్దామని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. శాసన సభ ఎన్నికల్లో నేను పోటీ చేసిన సిరిసిల్లలో 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు.. మనకు వచ్చిన ఓట్లు ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అనే విషయంలో బూత్ వారీగా, గ్రామాల వారీగా సమీక్ష చేశామన్నారు. ఓటింగ్ శాతం పెంచడంతోపాటు 75 శాతం ఓట్లు వచ్చే విధంగా చేయడం వల్లనే 89 వేల ఓట్ల మెజార్టీతో గెలిచానని తెలిపారు. ఇదే సూత్రాన్ని అన్ని ఎన్నికలకు పాటిస్తే ప్రతి ఎన్నికలో మన జెండానే ఎగరడం ఖాయమన్నారు.
కార్యకర్తలకు అండగా గులాబీ జెండా
14 ఏళ్ల పాటు ఎత్తిన గులాబీ జెండా దించకుండా మోసే కార్యకర్తలు అండగా ఉండటమే తన ప్రధాన కర్తవ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కొత్తగా ఏర్పడబోతున్న రెండు జిల్లాలతోపాటు 33 కార్యాలయాలను నిర్మాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలకు అండగా ఉం టామన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని, అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. అపారమైన అనుభవం ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటారని తాను మాత్రం కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్–వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానన్నారు.
పార్టీ కార్యాలయాల నుంచే..
ప్రజా ప్రతినిధులుగా గెలిచినా అందరికీ పార్టీ తల్లి లాంటిదని కేటీఆర్ అన్నారు. మంత్రులు సహా ప్రజా ప్రతినిధులందరూ ఇక నుంచి పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. భవిష్యత్‌లో కార్యకర్తలకు మంచి రోజులుం టాయని భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ను నిలబెడతామన్నారు. సభల్లో మాజీ ఉప ముఖ్యమం త్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి, ఎమ్మె ల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మంత్రి వర్గంలో జనగామకు చోటు
మంత్రివర్గంలో జనగామ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో చేపట్టబోయే నూతన కేబినెట్‌లో ఇక్కడి నుంచి ఒక్కరికి మంత్రిగా అవకాశం రానుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జనగామను అన్నిరంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు.