రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో తీసుకుంటున్న చర్యలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలిసింది.
మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు మృతి చెందడం, మరో ముగ్గురు గాయపడటంతో భవిష్యత్తులో ప్రాణనష్టం వాటిల్లకుండా పోలీసు యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలు, అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
ఏపీ నుంచి వచ్చే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం రవాణా పన్ను విధించటం, దీనిపై ఏపీ నుంచి వ్యతిరేకత రావటం... తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటితోపాటు ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఒక రాష్ట్రానికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఒక పత్రికలో వచ్చిన వార్తలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.