సంక్షేమం దిశగా ‘సాగు’తున్నాం | Sakshi
Sakshi News home page

సంక్షేమం దిశగా ‘సాగు’తున్నాం

Published Fri, Nov 29 2019 2:27 AM

KCR With Media After Cabinet Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావడంతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం కేబినెట్‌ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రధాన రహదారుల మరమ్మతు, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం విక్రయం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని 2–3 నెలల్లో మరమ్మతు చేసేందుకు రూ. 571 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

నిబద్ధత ఉన్న కాంట్రాక్టర్లను మాత్రమే పిలిచి పనులు అప్పగించి రహదారులను యథాతథ స్థితికి తెచ్చి ప్రయాణం సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా సంగారెడ్డి–నాందేడ్‌ రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకి బదిలీ చేసినా కేంద్రం ఇంకా పనులు చేపట్టకపోవడంతో చాలా చోట్ల గుంతలు తేలాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్తే కొన్ని నిధులిచ్చారన్నారు. ఇప్పుడు కూడా 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లను ఎన్‌హెచ్‌ఏఐకి బదిలీ చేసినా మంజూరైన రోడ్ల పనులు కొన్ని చోట్ల ప్రారంభం కాలేదని, దీనిపై అవసరమైతే కేంద్రంతో మళ్లీ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. 

ఏప్రిల్‌ వరకు సాగునీరిస్తాం...
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ధాన్యం దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగనుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గతంలో జూరాల కింద లక్ష ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా ప్రస్తుతం పాలమూరు జిల్లాలోనే 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని చెప్పారు. జూరాలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్‌తోపాటు దాదాపు 2 వేల చెరువులు నింపడంతో ప్రత్యక్ష సాగు మాత్రమే కాకుండా భూగర్భ జలాలు పెరిగాయని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కూడా రైతులకు కలసి వస్తోందన్నారు. యాసంగి పంటకు సంబంధించి ఎస్సారెస్పీలో భాగంగా ఉన్న మహబూబాబాద్, కోదాడ, నడిగూడెం, తుంగతుర్తి ప్రాంతాలకు రైతుల కోరిక మేరకు ఏప్రిల్‌ వరకు 110 టీఎంసీల సాగునీటిని అందిస్తామని కేసీఆర్‌ వివరించారు. నెలన్నరలో మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తాయన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేయడంతోపాటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పనులు, పోడు భూముల అంశాన్ని పరిశీలించేందుకు త్వరలో అక్కడ పర్యటిస్తానని కేసీఆర్‌ చెప్పారు. త్వరలో పాలసీపై వ్యవసాయ మంత్రి ప్రకటన..రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి సంబంధించి డిస్పోజల్‌ పాలసీని రూపొందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వరి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని, కొనుగోళ్ల కోసం ఎఫ్‌సీఐ, కేంద్రంపై ఆధారపడకుండా ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. నూతన పాలసీపై త్వరలో వ్యవసాయ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ సీజన్‌లో వరి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు వీలుగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ఇప్పటికే రూ. 7 వేల కోట్ల గ్యారెంటీ ఇచ్చామని, అవసరమైతే మరో రూ. 5 వేల కోట్ల గ్యారెంటీ ఇవ్వడంతోపాటు రుణ పరిమితి పెంచాలని కోరతామన్నారు.

28 కార్పొరేషన్ల నియమావళి సవరణకు ఆర్డినెన్స్‌ 
మూసీ రివర్‌ ఫ్రంట్, రైతు సమన్వయ సమితి వంటి కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చైర్మన్‌లుగా నియమించడంలో ప్రతిబంధకాలు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న లాభదాయక పదవుల నిబంధనను 28 కార్పొరేషన్లకు వర్తించకుండా త్వరలో ఆర్డినెన్స్‌ తెస్తామన్నారు. రైతుల పేరిట రికార్డులు ఉండేలా నూతన రెవెన్యూ చట్టాన్ని వంద శాతం తెస్తామని, నీటిపారుదల రంగంలో సాధించిన పురోగతికి కొనసాగింపుగా ఇన్నాళ్లూ సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement