కిట్‌కట ! 

KCR Kit Scheme Is Not Distributions In Mahabubnagar - Sakshi

పాలమూరు: ప్రైవేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు సర్కార్‌ దవాఖానాల్లో ప్రసవాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణమో ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు కేసీఆర్‌ కిట్‌ అండం లేదు. తల్లీ, బిడ్డకు ఉపయోగపడే రూ.2వేలకు పైగా విలువైన వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నారు.

ఈ పథకం ఇన్నాళ్లు సాఫీగానే సాగగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ సమయంలో కేసీఆర్‌ చిత్రం ముద్రించిన కిట్‌ ఇవ్వొద్దన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు వచ్చాయి. దీంతో అయితే, కేసీఆర్‌ చిత్రం లేకుండా కిట్‌ మాత్రం అందజేశారు. అలా ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో సాఫీగా అందిన కిట్‌ గత నెల రోజులుగా అందడం లేదు. గత నెల 29వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవసవించిన బాలింతలకు కేసీఆర్‌ కిట్లు ఇవ్వడం లేదు. ప్రసవించిన సమయంలో ఇవ్వకుండా తర్వాత రావాలని సిబ్బంది చెబుతుండడంతో దూరప్రాంతాల నుంచి రావాల్సిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఆస్పత్రులు, పీహెచ్‌సీలు 
మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రితో పాటు నారాయణపేట ఏరియా ఆస్పత్రి, జడ్చర్ల, మక్తల్, కోస్గి, కోయిల్‌కొండల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉండగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 28ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉన్నాయి. అయితే, వైద్యసేవలందించడంలో మా త్రం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి కీలకపాత్ర పోషిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన గర్భిణులు కూడా ప్రసవం కోసం ఇక్కడకు వస్తున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనరల్‌ ఆస్పత్రిలో కేసీఆర్‌ కిట్‌ ఇవ్వకపోవడంతో బాలింతలు ఆందోళన చెందుతున్నారు.
 
వివరాలు నమోదు 
కే
సీఆర్‌ కిట్‌లు లేకపోవడంతో బాలింతల వివరాలను సంబంధిత సిబ్బంది సేకరిస్తున్నారు. ఆస్పత్రి నుంచి ప్రతి రోజు డిశ్చార్జ్‌ అవుతున్న బాలింతల ఫొటోలు, ఫోన్‌ నెంబర్లు, తల్లి ఆధార్‌ కార్డు, చిరునామా తీసుకొని కిట్‌లు వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని చెబుతున్నారు. దాదాపు 25 రోజులుగా కిట్ల పంపిణీ లేకపోవడం వల్ల చాలా మంది బాలింతలు, వారి బంధువులు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే, వచ్చిన ప్రతీసారి ఇంకా కిట్‌ రాలేదని సిబ్బంది చెబుతుండడంతో వారు నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు.

నగదు జమ ఏదీ? 
అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు సాయాన్ని అందచేసేందుకు గ్రామాల్లో మూడు నుంచి ఐదు నెలల గర్భంతో ఉన్న మహిళలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అర్హుల ఎంపిక బాధ్యతను అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు అప్పగించారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో గర్భిణులను గుర్తించి వారి పేర్లు, బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్‌ ఇతర వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం అందజేసిన ట్యాబ్‌ల ద్వారా ఏఎన్‌సీ కార్డుతో గర్భిణుల వివరాలను నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఆ తర్వాత ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని పొందడానికి ప్రతీ గర్భిణి తనకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పేరు నమోదు చేసుకుని కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటే రూ.3వేలు బ్యాంకులో జమ చేస్తారు.

రెండో విడతగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ.4వేలు ఇస్తారు. ఇక మూడో విడతగా బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇప్పించాల్సిన టీకాలు సక్రమంగా ఇప్పించిన తర్వాత రూ.3వేలు జమ చేస్తారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది గర్భిణులను గుర్తించడంలో అలసత్వం చేస్తున్నారు. ఫలితంగా సర్కారు ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్నా ప్రభుత్వం ఇచ్చే నగదు అందడం లేదు. ఇటీవల కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షలో గర్భిణులను నమోదు 28శాతం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనీసం 50శాతమైనా ఉండాలని ఆదేశించడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top