ఎమ్మెల్యే చిన్నయ్య వ్యాఖ్యలపై నిరసనలు

Journalist Comments On MLA Durgam Chinnaiah - Sakshi

ఉమ్మడి జిల్లాలో ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు

పలు పార్టీలు, సంఘాల మద్దతు

క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే

మంచిర్యాలటౌన్‌ : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ‘సాక్షి’ దినపత్రిక మంచిర్యాల జిల్లా ప్రతినిధి పోలంపల్లి ఆంజనేయును కించపరిచే విధంగా మాట్లాడినందుకు గాను గురువారం ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్ధతు పలికారు. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే బెల్లంపల్లిలోని తన క్యాంపు కార్యాయలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తూ క్షమాపణ కోరారు. 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో...
జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అం దించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రజా సమస్యలను నిజాయతీగా వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ప్రతినిధి ఆంజనేయులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై కథనాలు రాసే విలేకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే ఎమ్మెల్యే సమావేశాలను బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. ధర్నాలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి యెర్రం ప్రభాకర్, కార్యదర్శి సిహెచ్‌.శ్రీనివాస్, ఎలక్ట్రానిక్‌ మీడియా కార్యదర్శి సంతోశ్, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కాచం సతీశ్, జిల్లా ఉపాధ్యక్షుడు డేగ సత్యం, ఈసీ మెంబర్‌లు జి.సతీశ్, ఎం.రవి, ఎన్‌.రమేశ్, కె.వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో...
బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌ తరుపున జర్నలిస్టులంతా రోడ్డుపై గంటన్నర రాస్తారోకో చేశారు. వీరికి మద్ధతుగా సీపీఐ రాష్ట్ర నాయకులు గుండా మల్లేశ్, జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు, బీజేపీ నాయకులు కొయ్యాల ఏమాజీ, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి బి.కేశవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని జర్నలిస్టులకు మద్ధతు తెలిపి, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జన్నారం మం డల కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రోడ్డుపై రాస్తారోకో చేశారు.

దండేపల్లిలో జర్నలిస్టులు నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చెన్నూరులో జర్నలిస్టులంతా రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. భీమా రం మండలంలో విలేకర్లు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్‌ భూమేశ్వర్‌కు వినతి పత్రం అందించారు. నిర్మల్‌ జిల్లాలోని కుంటాలలో మండలానికి చెందిన విలేకర్లు నిరసన తెలిపిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ అజీజ్‌ఖాన్‌కు వినతిపత్రాన్ని అందించారు. బాసరలో సైతం విలేకర్లు ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు.

కడెం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిర్మల్‌–మంచిర్యాల రహదారిపై బైటా యించి ఆందోళన చేపట్టారు. ఖానాపూర్‌లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. కాగజ్‌నగర్‌లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన అనంతరం తహసీల్దార్‌ రాంమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top