యాదాద్రికి ద్వారపాలకుల విగ్రహాలు

Jaya Vijays idols on the Sudarshana rajagopuram in Yadadri - Sakshi

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా సుదర్శన విమాన రాజగోపురంపైన ఏర్పాటు చేసేందుకు జయ విజయుల విగ్రహాలు శుక్రవారం యాదాద్రికి చేరుకున్నాయి. ఇవి ఒక్కోటి సుమారు ఆరున్నర అడుగులు ఉన్నాయి. శనివారం ఉదయం వీటిని రాజగోపురంపై ప్రతిష్ఠించనున్నారు. ఒక్కో ద్వారపాలకుడి విగ్రహం తయారు చేసేందుకు సుమారు 2 నెలల సమయం పట్టిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 8 విగ్రహాలను ఆళ్లగడ్డ, గుంటూరు నుంచి తీసుకువచ్చారు.  

ఇప్పటికే శిల్పులు సప్త రాజగోపురాలను పూర్తి చేశారు. ప్రస్తుతం వాటిపై శిల్పాలను ప్రతిష్ఠించే పనులు చేస్తున్నారు. వీటిని సైతం మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రధానాలయం పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. చినజీయర్‌స్వామి ఆదేశాల మేరకు ప్రధానాలయం ప్రతిష్ఠ కార్యక్రమాలకు తేదీల నిర్ణయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

నిత్య కల్యాణ మండపం మార్పు 
ప్రధానాలయంలోని ప్రాకారానికి వెనక వైపు నిత్య కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు మొదట భావించారు. అయితే రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అది సరిపోదని భావించి నిత్యకల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా నిర్మించాలని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో సుమారుగా 50 నుంచి 70 కల్యాణాలు జరుగుతాయి. కాగా, ప్రతి శని, ఆదివారాలు, పర్వదినాలు, శేష రోజుల్లో వందల సంఖ్యలో జరుగుతాయని భావించి పెద్దగా ఉండేలా ప్రత్యేక మండపం నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మండపానికి వచ్చేందుకు ఒక ద్వారం, వెళ్లేందుకు మరోద్వారం ఏర్పాటు చేయనున్నారు.  

శిలాస్తంభాలపై నాణేల చిత్రాలు  
అష్టభుజి మండపం శిలాస్తంభాలపై 5 రూపాయలు, ఒక రూపాయి, రెండు పైసల నాణేం వంటి అనేక చిత్రాలే కాకుండా జంతువులు, వివిధ పనులకు సంబంధించిన పనిముట్లు, కాకతీయుల కాలం నాటి ముద్రణలు, శివాజీ, అమ్మవారి కలశం, వంటి వివిధ ఆకృతులలో ఉండే చిత్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. తెలంగాణ జీవన శైలికి అద్దం పట్టే విధంగా ఈ కళాకృతులను చెక్కుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top