ముందస్తు ఉత్కంఠ

Jamili Elections In Telangana Assembly Moments Medak - Sakshi

రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కదలిక మొదలైంది. వచ్చే నెలలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో జహీరాబాద్‌ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టి తమకు టికెట్‌ దక్కుతుందనే ఆశ కొందరు అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ‘ముందస్తు’ హడావుడితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ప్రధాన విపక్ష పార్టీల్లో మాత్రం అలాంటి సందడి ఎక్కడా కనిపించడం లేదు

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభను వచ్చే నెలలో రద్దు చేసి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగే ‘ప్రగతి నివేదన’ సభ అనంతరం ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామనే సీఎం ప్రకటన నేపథ్యంలో పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ద్వారా ‘క్లీన్‌ స్వీప్‌’ చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొంతకాలంగా కొత్త జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమీక్షల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో దూరంగా ఉంటున్న నేతలు పార్టీ వీడకుండా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, క్రియాశీల నేతలతో నేరుగా సంబంధాలు నెరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఎన్నికల నాటికి అందరినీ సమన్వయం చేసి ఫలితం రాబట్టాలనేది మంత్రి వ్యూహంగా కనిపిస్తోంది.

టికెట్ల వేటలో ఔత్సాహికులు
జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్‌ కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తాజాగా మాత్రం అంతర్గత సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని వ్యాఖ్యానించడంతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని చోట తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్న ఔత్సాహిక నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో కొత్త అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ తెరమీదకు తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాణిక్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చుతారని భావిస్తున్నారు.    ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

అందోలు, నర్సాపూర్, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం సాగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, జర్నలిస్టు యూనియన్‌ నేత క్రాంతి కిరణ్‌ టికెట్‌ ఆశిస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నడుమ పొత్తు కుదిరితే నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు పెనుమార్పులకు లోనవుతాయని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది. నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆయన సతీమణి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి యాదవ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ ఈ నెల మొదటి వారంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడంతో సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి.

 ఇతర పార్టీల్లో కానరాని సందడి
ముందస్తు ఎన్నికల నిర్వహణపై సీఎం సంకేతాల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో సందడి మొదలైంది. విపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో మాత్రం రాజకీయ కార్యకలాపాలు పెద్దగా ఊపందుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విపక్ష పార్టీలకు చెందిన కొందరు బడా నేతలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు మాత్రం చాప కింద నీరులా అసెంబ్లీ ఎన్నికల దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అరడజనుకు పైగా నియోజకవర్గాల్లో బహుళ, బలహీన నాయకత్వం కాంగ్రెస్‌కు ఆటంకంగా మారేలా ఉంది. నారాయణఖేడ్, పటాన్‌చెరులో కొంత మేర టీడీపీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నా, ఇతర నియోజకవర్గాల్లో నామమాత్ర కేడర్‌ కూడా లేదు. కార్మిక వర్గం ఓట్లపై ఆధారపడి సీపీఎం, తెలంగాణ వాదంపై తెలంగాణ జన సమితి ఎన్నికల దిశగా అభ్యర్థుల కోసం వేట సాగిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top