మంత్రి జగదీష్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం

Jagadish Reddy Faces Bitter Experience At Vemulakonda Hospital - Sakshi

సాక్షి, భువనగిరి(యాదాద్రి ) : మూసీ కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడడంతో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వేములకొండకు చెందిన 30 మంది మహిళా కూలీలు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లున్న క్రమంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను స్థానిక వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంమయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రకటించారు. వారి పిల్లల చదువులకయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అలాగే, తన వంతుగా ఫైళ్ల ఫౌండేషన్‌ తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున శేఖర్‌రెడ్డి సాయం ప్రకటించారు.

కాగా, 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెళ్లిపోతున్న మంత్రి జగదీష్‌ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్‌, సీపీఐ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనూ, క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంలోనూ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతూ ఆస్పత్రి నుంచి మృత దేహాల తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top