breaking news
Vemulakonda
-
మత్స్యగిరీశుడికి మహర్దశ!
సాక్షి, యాదాద్రి: నాలుగున్నర ఫీట్ల ఎత్తుతో మత్స్యం మీద కూర్చున్న లక్ష్మీనరసింహుల ఏకశిలా విగ్రహం..58 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న భారీ క్షేత్రపాలకుడి విగ్రహం.. మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న జయవిజయులు, గరత్మంతులు, ఉత్సవమూర్తుల విగ్రహాలు.. ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో విస్తరించనున్న ఆలయం.. ఇలా మరెన్నో అభివృద్ధి పనులతో మత్స్యగిరీశుడి క్షేత్రం నూతన కళ సంతరించుకుంటోంది. వలిగొండ మండలం వేములకొండ గుట్టపై వెలసిన మత్స్యగిరీశుడి ఆలయం జిల్లాలో మరో అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వాస్తు, ఆగమశాస్త్రం ప్రకారం త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. 2018 విజయదశమి రోజున ఆలయ చైర్మన్, దాతలు, భక్తుల సహకారంతో పనులకు అంకురార్పణ చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకు అనుగుణంగా పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. జరుగుతున్నవి, చేపట్టనున్న పనులు గర్భాలయం వెనుక చేపట్టిన ఉత్సవమూర్తుల ఆలయం, గోపురాల నిర్మాణం పూర్తి కావొచ్చాయి. నాలుగున్నర ఫీట్ల ఎత్తులో మత్స్యం మీద స్వామి,అమ్మవార్లు కూర్చున్న కృష్ణ శిలతో చెక్కిన ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠింనున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో స్వామి,అమ్మవార్ల విగ్రహంతో పాటు జయవిజయులు, గరత్మంతుల విగ్రహాలను తయారు చేయించారు. ఈ విగ్రహాలు సెప్టెంబర్ 5న మత్స్యగిరి కొండపైకి చేరుకోనున్నాయి. ఇప్పటికే నూతన ధ్వజస్తంభం సిద్ధమైంది. దీనికి ఇత్తడి తొడుగు అమర్చనున్నారు. స్వామివారి సేవలు తీసే సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా పుష్కరిణి చుట్టూ తూర్పు, దక్షిణ భాగాల్లో 8 ఫీట్ల మే విస్తరించనున్నారు. ఇందుకోసం దేవస్థానం నిధులను ఖర్చు చేయనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలతో సీపీఎస్ పనుల ద్వారా సత్యనారాయణ వ్రత మండపానికి పక్కా భవనం నిర్మించనున్నారు. ధ్వజస్తంభం నుంచి స్వామివారి గర్భాలయం వరకు గుండం మీదుగా ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత చైర్మన్ కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు సమన్వయంతో దాతల సహకారం లభిస్తోంది. కోటి రూపాయల అంచనాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకు వసతులు కల్పించడం కోసం ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షుడు ఎంతో కృషి చేస్తున్నారు. భారీ ఆంజనేయస్వామి విగ్రహం కొండపైన గల శ్రీసీతారామచంద్రస్వామి, ఆలయం ఎదుట 51 అడుగుల ఎత్తులో ఆంజనేయస్వామి నిలువెత్తు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి సుమారు రూ.20లక్షల సొంత నిధులతో ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని, చుట్టూ భక్తులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయస్వామి విగ్రహాం తయారీ తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రారంభించనున్నారు. 42 ఎకరాల స్థల వితరణ వేములకొండ లక్ష్మీనర్సింహస్వామికి 42ఎకరాల స్థల వితరణ చేశారు. వేములకొండకు చెందిన పారిశ్రామికవేత్త గార్లపాటి సురేందర్‌రెడ్డి జీయర్‌స్వామి సమక్షంలో దేవస్థానానికి 42ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో దేవస్థానం పరిసరాల్లో వసతులు మెరుగుపర్చడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. శని, ఆది, సోమవారాలతోపాటు వీకెండ్ రోజుల్లో 20వేల వరకు భక్తులు వచ్చి వెళ్తున్నారు. నూతన సంవత్సరం, కార్తీకమాసం, శ్రావణమాసం, పుణ్యతిథులైన పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి పర్వదినాల్లో భక్తులు సత్యనారాయణ వ్రతాలు, పుట్టువెంట్రుకలు, స్వామివారికి సమర్పించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకుంటారు. విశిష్టమైనది విష్ణు పుష్కరిణి విష్ణు పుష్కరిణి అత్యంత విశిష్టమైనది. ఈపుష్కరిణిలోనే స్వామివారు వేలిశారని భక్తుల నమ్మకం. ఇందులో నీరు ఎప్పుడు ఇంకిపోతుంది. పుష్కరిణిలోని నీటితోనే స్వామివారిని ప్రతిరోజూ అభిషేకిస్తారు. పుష్కరిణిలో చేపల తలలపై స్వామివారి నామాలు దర్శనమిస్తాయి. దీంతో పుష్కరిణిలోని నీటిని పొలాల్లో చల్లితే పెద్ద ఎత్తున పంటలు పండుతాయని భక్తుల నమ్మకం. ఏటేటా పెరుగుతున్న భక్తులు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంలో కాలిబాటన కొండపైకి చేరుకునే భక్తులకు ప్రస్తుతం రోడ్డు వసతిని కల్పించారు. కొండపై ముఖ మంటపం, గోదాదేవి ఆల యం, సత్యానారాయణస్వామి వ్రత మంట పం, మూడు అంతస్తుల రాజగోపురం, పంచముఖ రామలింగేశ్వర ఆలయం, యాగశాల, విశ్రాంతి భవనం,షాపింగ్ కాంప్లెక్స్, సత్రాలు, కోనేరు చూట్టు సీసీ రోడ్డు, లడ్దు ప్రసాద విక్రయ శాల, విశ్రాంతి భవనం ఉన్నాయి. రోడ్డుపైకి ఘాట్‌రోడ్డు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దాతలు, భక్తుల సహకారంతో.. త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆలోచనల మేరకు భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. జీయర్‌స్వామి కొండపైన ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా స్వయంభూవుగా వెలసిన లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ రూపం ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారం, తనవంతు ఆర్థిక సహాయంతో గత విజయదశమిన జియర్‌స్వామి ప్రారంభించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. జియర్‌స్వామి చేతుల మీదుగా స్వామివారి దర్శనం కల్పించబోతున్నాం. –కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ గ్రహ పీడలు తొలగిపోతాయి స్వామివారి తీర్థం స్వీకరించిన భక్తుల శారీ రక గ్రహపీడ బాధలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పుష్కరిణిలోని తీర్థంతో ప్రతి నిత్యం స్వామివారికి అభిషేకిస్తాం. భక్తులు ఎవరైనా 11రోజులు ఈవిష్ణు తీర్థాన్ని స్వీకరించినట్లయితే గ్రహదోశం, సంతానప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార వివాహాలు కలుగుతాయని విశ్వాసం. ఈతీర్థాన్ని పంట పొ లాల్లో చల్లితే పాడిపంటలు సమృద్దిగా పండుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. –యాదగిరి స్వామి, అర్చకుడు -
‘అది నా దృష్టిలో వికృతమైన చర్య’
సాక్షి, నల్గొండ : సవాళ్లు విసురుకోవటం అనేది తన దృష్టిలో వికృతమైన చర్యని, రాజకీయాల పట్ల వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా కూరగాయల బేరంలాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మంత్రిగారు వ్యంగంగా 50 లక్షలు కావాలా అని వ్యాఖ్యానించటం చాలా దురదృష్టకరమన్నారు. ఎక్స్‌గ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, కనీసం 6లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆదివారం ట్రాక్టర్ మూసీ కాలువలో బోల్తాపడిన ఘటనలో వేములకొండకు చెందిన 15మంది మృతిచెందిన విషయం తెలిసిందే. -
మూసీ దుర్ఘటన; ఆస్పత్రి వద్ద ఆందోళన
సాక్షి, భువనగిరి(యాదాద్రి ) : మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వేములకొండకు చెందిన 30 మంది మహిళా కూలీలు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లున్న క్రమంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మృతదేహాలను స్థానిక వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంమయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రకటించారు. వారి పిల్లల చదువులకయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. అలాగే, తన వంతుగా ఫైళ్ల ఫౌండేషన్ తరపున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున శేఖర్‌రెడ్డి సాయం ప్రకటించారు. కాగా, 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెళ్లిపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్, సీపీఐ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనూ, క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంలోనూ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు, ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతూ ఆస్పత్రి నుంచి మృత దేహాల తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. -
దేవుడికి భక్తుల బిస్కెట్!
భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడంలో భక్తులు వివిధ రకాల ఆచారాల్ని పాటిస్తారు. భగవంతుడి పత్ర్యేకతను బట్టి ఆయ ప్రాంతాల్లో ప్రసాదాలు కూడా మారుతుంటాయి. కాని హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలోని వలిగొండ మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని చేపలకు బిస్కెట్లను ప్రసాదాలుగా సమర్పిస్తారు. అందుకు కారణంగా ఈ ఆలయానికి చేరువలోని సరస్సులోని చేపల తలపై విష్ణు నామాలు ఉండటమే కారణమట. వలిగొండ మండలంలోని వెములకొండ గ్రామంలోని ఓ కొండపై ఈ ఆలయం ఉంది. ఈ సరస్సులోని చేపలు బయటకు తేలడానికి భక్తులు బిస్కెట్లను విసరడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సరస్సులోని చేపలు విష్ణుదేవుడ్ని భక్తులు మత్స్య అవతారంలో చూసుకుంటారని ఆలయ పూజారి శ్రీనివాసచార్యులు వెల్లడించారు. ఇక్కడి సరస్సుల్లోని ప్రతి చేప విష్ణుమూరి తొలి అవతారమైన మత్య్స అవతారంలో ఉంటారని గాఢంగా భక్తులు విశ్వసిస్తారని పూజారి తెలిపారు. పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతోపాటు బిస్కెట్లు కూడా ఉదయం ఆరు గంటలకే చేపలకు సమర్పిస్తారని పూజారి అన్నారు. చేపలకు బిస్కెట్ ప్రసాదం సమర్పించడానికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా బిస్కెట్ల అమ్మకానికి అనుమతి కూడా ఇచ్చింది. గతంలో సరస్సును శుద్ది చేసే భాగంగా పాత నీటిని తీసివేసి.. కొత్త నీటితో సరస్సును నింపారట. అయితే కొత్త నీరు చేర్చిన తర్వాత ఓ ట్రక్ లోడ్ సరిపోయే చేపలు సరస్సులో మరణించడం భక్తుల విశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపిందని అక్కడివారు చెబుతారు. అయితే సరస్సులోని చేపగుడ్లు మళ్లీ ఫలదీకరణం చెందడంతో మళ్లీ విష్ణు నామాలున్న చేపలు భారీ సంఖ్యలో జన్మించాయని స్థానికులు వెల్లడించారు. మండు వేసవి కాలంలో కూడా ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉంటాయన్నారు. ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవర్ని అనుమతించారు, ఎందుకంటే .. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు రక్తం కక్కుకుని మరణించాడని అక్కడి వాళ్లు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టు పక్కల వారు రెగ్యులర్ గా ఆలయాన్ని సందర్శించుకోవడంతోపాటు.. చేపలకు బిస్కెట్ ప్రసాదాన్ని సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.