వాట్సాప్‌.. హ్యాట్సాఫ్‌

IT Employees Working For Traffic Volunteer in Hyderabad - Sakshi

ముగ్గురు క్షతగాత్రులకు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఎస్‌సీఎస్‌సీటీ ట్రాఫిక్‌ వలంటీర్ల సేవలు

108, డయల్‌ 100 బిజీ ఉండటంతో ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌ గ్రూప్‌లో పోస్టు

తక్షణమే స్పందించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌  

స్థానిక పోలీసులకు సమాచారం

సమీప ఆస్పత్రులకు తరలింపు తప్పిన ప్రాణాపాయం  

సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌ ఉద్యోగులకు ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) ట్రాఫిక్‌ వలంటీర్లుగా పని చేయడమేకాకుండా మానవతా ధృక్ఫథాన్ని చాటుకుంటోంది. ఐటీ ఉద్యోగులుగా పని చేస్తూనే ట్రాఫిక్‌ వలంటీర్లుగా సేవలందిస్తూ ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు 108, డయల్‌ 100కి కాల్‌ చేస్తున్నారు. సేవలు అందడంలో జాప్యం జరిగితే ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌లో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తదితరులు సభ్యులుగా ఉండటంతో వెంటనే స్పందించి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడుతున్నారు.

సెకన్లలో స్పందించిన సీపీ
మాదాపూర్‌లోని 24ఎంఎం స్టార్టప్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌ చిన్నం ప్రతిరోజూ శంకర్‌పల్లి సమీపంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి కార్యాలయానికి వచ్చి వెళుతుంటాడు. 2018 అక్టోబర్‌లో ఎస్‌సీఎస్‌సీ వలంటీర్‌గా చేరిన అతను సైబర్‌ టవర్‌ జంక్షన్‌ సిగ్నల్‌ వద్ద వారంలో నాలుగు రోజులు సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను వలంటీర్‌ విధులు ముగించుకొని కారులో వెళుతుండగా మోకిలా వద్ద రెండు బైక్‌లు కిందపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారికి తన వద్ద ఉన్న ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ బ్యాగ్‌తో ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108కి కాల్‌చేస్తే అంబులెన్స్‌లు అందుబాటులో లేవని సమాధానం వచ్చింది. డయల్‌ 100కు కాల్‌ చేసినా వెయింటింగ్‌ అని రావడంతో ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ శంకర్‌పల్లి పెట్రోలింగ్‌ వాహనాన్ని అక్కడికి పంపారు. బాధితులను శంకర్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

క్విక్‌ రియాక్షన్‌...
నిజాంపేటకు చెందిన విద్యాసాగర్‌ జగదీషన్‌ గచ్చిబౌలి ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌  టెక్నాలజీ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తూ ఐదు నెలలుగా ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌గా   సేవలందిస్తున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్‌ సిగ్నల్‌ వద్దనే ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్‌ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను నల్లగండ్ల ఫ్లైఓవర్‌ మీదుగా ఇంటికి తిరిగివెళుతుండగా ఓ గుర్తు తెలియని బైక్‌ రోడ్డు క్రాస్‌ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీనిని గుర్తించిన విద్యాసాగర్‌ తన వద్ద ఉన్న ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌తో అతడికి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108, 100 డయల్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సమీపంలోని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డిని అప్రమత్తం చేసి ఘటనాస్థలికి పంపడంతో ఆస్పత్రికి తరలించారు.    

అందరూ ముందుకొస్తేనే..
పోలీసులు, ట్రాఫిక్‌ వలంటీర్లే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనకెందుకులే అనుకోకుండా ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయవచ్చు. అలాంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. చాలా సార్లు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేద్దామని అనుకున్నప్పటికీ... సాయంచేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని ముందుకు రారు. మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ ప్రాణం. మీ ఉదాసీనత కారణంగా క్షతగాత్రులకు చికిత్స ఆలస్యమై వారు చనిపోయే ప్రమాదం ఉంది. మీరు తక్షణమే స్పందించడం వల్ల ఓ మనిషి ప్రాణాన్ని కాపాడినవారవుతారు. ముగ్గురు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వలంటీర్లకు అభినందనలు.      – వీసీ సజ్జనార్‌ , సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

ఏమిటీ వాట్సాప్‌ గ్రూప్‌
ఐటీ కారిడార్‌లోని వివిధ జంక్షన్లలో పనిచేస్తున్న 250 మంది ట్రాఫిక్‌ వలంటీర్లు ఈ ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్‌ వలంటీర్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆయా జంక్షన్లలో వాహనదారులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు రోడ్ల పరిస్థితి, సిగ్నలింగ్‌ సమస్యలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకొని ఇందులో పోస్టు చేస్తుంటారు. భారీగా ట్రాఫిక్‌ ఉన్న సమయాల్లోనూ సమాచారం చేరవేస్తూ సిగ్నల్‌ మాన్యువల్‌గా మార్చేస్తుంటారు. ఈ గ్రూప్‌లో ఎస్‌సీఎస్‌సీ ప్రతినిథులు, వలంటీర్లతో పాటు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సభ్యులుగా ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top