రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి

International Seed Advisory Council in the state - Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

యూరోపియన్‌ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి యూరప్‌ దేశాలతోపాటు వియత్నాం, కంబోడియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్‌ దేశాలకు విత్తన ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం నెదర్లాండ్స్‌లోని సీడ్‌ వ్యాలీని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూరగాయల విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించడం మూలంగా అంతర్జాతీయ విత్తన విపణిలో కీలకంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్‌లో అంతర్జాతీయ విత్తన సలహామండలి, రైతులకు అంతర్జాతీయ విత్తన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని బండమైలారంలో 150 ఎకరాల్లో విత్తన పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 

దేశానికి 60 శాతం సరఫరా.. 
ప్రస్తుతం దేశానికి అవసరమైన విత్తనాల్లో 60 శాతం తెలంగాణ సరఫరా చేస్తోందన్నారు.  జర్మనీ, నెదర్లాండ్స్‌ పర్యటనలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులతో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విత్తన సలహా మండలి గురించి ఆయన చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం ప్రకారం తెలంగాణను గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ అంతర్జాతీయ విత్తన సలహా మండలి కీలక పాత్ర పోషిస్తుందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top