పాస్‌ గ్యారంటీ..!?

Impropriety In Inter And Tenth Open Exams - Sakshi

విద్యార్థులకు ‘ఓపెన్‌’ సెంటర్‌ నిర్వాహకుల భరోసా  

ఆ పేరుతో భారీగా వసూళ్లు !

తరగతులు నిర్వహించకుండానే పరీక్షలకు..  

నేటి నుంచి ఓపెన్‌ పది, ఇంటర్‌ ఎగ్జామ్స్‌

కొత్తగూడెం:  తెలంగాణ సార్వత్రిక పీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలలో ఎలాంటి అక్రమాలు జగరకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆయా సెంటర్ల నిర్వాహకులు మాత్రం విద్యార్థుల నుంచి పాస్‌ గ్యారంటీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రతీ ఏడాది ఇలాగే నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  
తరగతులు లేకుండానే పరీక్షలకు..

రెగ్యులర్‌గా పది, ఇంటర్‌ మీడియట్‌ విద్యనభ్యసించలేనివారు సార్వత్రిక పీఠం ద్వారా చదువుకునేందుకు, రాష్ట్ర అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఈ ఏడాది 21 అధ్యయన కేంద్రాలు నడిచాయి. దీనికి గాను జూలైలో నోటిఫికేషన్‌ విడుదల చేసి సెప్టెంబర్‌ వరకు అడ్మిషన్లు తీసుకుంటారు. అభ్యర్థులకు ప్రతి ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు రోజుల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వం స్టడీ సెంటర్‌ నిర్వాహకులకు ఒక్కో తరగతి సబ్జెక్టుకు రోజుకు పదో తరగతి భోదించే వారికి రూ.40, ఇంటర్‌ తరగతులు భోదించే వారికి రూ.60 చొప్పున చెల్లిస్తుంది. 30 అడ్మిషన్లు దాటిన కేంద్రానికి అదనపు చెల్లింపులు ఉంటాయి. హాజరు పట్టిక ద్వారా విద్యార్థుల అటెండెన్స్‌ నమోదు చేయాలి. తరగతుల బోధన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కానీ అనేక కేంద్రాల్లో తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు రాయిస్తున్నారని సమాచారం. 

ఇష్టారీతిన వసూళ్లు..
రెగ్యులర్‌గా చదవలేనివారితో పాటు ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం ఈ విద్యను అభ్యసించేవారు ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న నిర్వాహకులు వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష ఫీజు రూ.1200 కాగా, పాస్‌ గ్యారంటీ పేరుతో ఆయా అభ్యర్థుల వద్ద రూ. 3,000 నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అ«ధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్టడీ సెంటర్‌ నిర్వాహకుల మాటలు నమ్మి తరగతులకు హాజరు కాకుండానే పరీక్షలు రాసేవారు ఎక్కువ మంది ఫెయిల్‌ అవుతున్నారు. జిల్లాలో ఓపెన్‌ పరీక్షలలో 4 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని  అధికారులు చెపుతుండడం దీనికి నిదర్శనం. అంతేకాక స్టడీ సెంటర్‌ నిర్వాహకులు సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయకపోవడం, తరగతులు నిర్వహించకపోవడంతో  ఆసక్తి ఉన్నా పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉమ్మడి జిల్లా కేంద్ర అధికారులు పర్యవేక్షించాలి. కానీ వారు సక్రమంగా పట్టించుకోకపోవడంతో స్టడీ సెంటర్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

నేటి నుంచి పరీక్షలు...
ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెంలోని ఆరు కేంద్రాలలో పదో తరగతి పరీక్షలకు 1065 రెగ్యులర్, 679 మంది సప్లిమెంటరీ విద్యార్థులు, ఇంటర్‌ అభ్యర్థులు 5 కేంద్రాల్లో 805 మంది రెగ్యులర్, 473 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నారు. మంగళవారం నుంచి మే 1 వరకు, ఉదయం 8.30 నుంచి 11.30 గంటల మధ్య పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో రెవెన్యూ శాఖ వారిచే సిట్టింగ్, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లతో పాటు డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్స్‌ కమిటీ, హై పవర్‌ కమిటీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని, ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయాలని, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాల్‌ టికెట్లను స్టడీ సెంటర్‌ నిర్వాహకులు జారీ చేయకపోతే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

జిల్లా కేంద్రంలోనే పరీక్షలు
ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని 11 సెంటర్లలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మకుండా మంచిగా చదివి పరీక్షలకు హాజరు కావాలి. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినా, వారికి సిబ్బంది సహకరించినా సీసీఏ రూల్స్‌ 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు, 25/1997 చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం.  – డి.వాసంతి, డీఈఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top