ఆద్యంతం.. ఆసక్తికరం!

Ibrahimpatnam Candidates Nomination Process Interesting To End Of Day - Sakshi

 ఇబ్రహీంపట్నంలో నామినేషన్ల ఆఖరి వరకు ఉత్కంఠ 

ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి బీఫాం 

కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డికి కూడా బీంఫాం ఇచ్చినట్టు ప్రచారం 

చివరికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన మల్‌రెడ్డి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీం పట్నం రాజకీయం తొలి నుంచి ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. నామినేషన్‌ చివరి రోజు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మహాకూటమి టికెట్‌ వ్యవహారం చివరి క్షణం వరకు ఉత్కంఠను తలపించింది. ఆఖరి వరకు కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగుతున్నానని ప్రకటించిన మల్‌రెడ్డి రంగారెడ్డి చివరిగా ‘ఏనుగు’ ఎక్కడంతో కథ సుఖాంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇబ్రహీంపట్నం రాజకీయం.. నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సీట్ల సర్దుబాటులో టీడీపీకి కేటాయించిన ఈ సెగ్మెంట్‌కు ఆ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ఖరారు చేసింది. ఎల్‌బీనగర్‌ను ఆశించిన ఆయన ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో అలకబూనిన సామను అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సముదాయించడంతో మెత్తబడ్డారు. 

నిరీక్షించి.. నిట్టూర్పు విడిచి 
ఈ నేపథ్యంలో బీ–ఫారం తీసుకునేందుకు ట్రస్ట్‌ భవన్‌కు వెళ్లిన సామ రంగారెడ్డికి నిరాశే మిగిలింది. బీ–ఫారం ఇచ్చేముందు అందరూ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన నాయకత్వం సామకు బీ–ఫారం ఇవ్వకుండా నిరీక్షించేలా చేసింది. సాం కేతిక కారణాలను చూపుతూ పక్కనపెట్టడంతో ఇదేదో తేడాగా ఉందని గమనించిన సామ రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లు టీటీడీపీ అధ్యక్షుడు రమణను కలిసి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. అయితే, టికెట్‌ కేటాయింపుపై సామ చేసిన వ్యాఖ్యలు బాధించాయని వాపోయిన రమణ.. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి సామకు బీ–ఫారం ఇచ్చి పంపారు.  

ఉదయమే పిడుగు.. 
బీ–ఫారం లభించడంతో ఊపిరి పీల్చుకున్న సామ రంగారెడ్డి సోమవారం నామినేషన్‌ వేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఈ మేరకు మహాకూటమి నేతలు, శ్రేణులంతా ఇబ్రహీంపట్నం తరలిరావాలని సూచించారు. అంతలోనే పిడుగులాంటి వార్త ఆయన చెవిలో పడింది. అదేమంటే కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డికి ఆ పార్టీ బీ–ఫారం అందజేసిందనే వార్త. దీన్ని రూఢీ చేసుకునేందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నించినా ఫలించకపోవడంతో చేసేదేమీలేక ఆయన అనుకున్న సమయానికి నామినేషన్‌ వేశారు.  

సీన్‌ కట్‌ చేస్తే.. 
మొదట్నుంచి ఈ సీటును ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించిన అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ప్రకటించినప్పటికీ సామ నిరాసక్తత కారణంగా తిరిగి కాంగ్రెస్‌కు వదిలేస్తారని మల్‌రెడ్డి భావించారు. కాదు కూడదంటే స్నేహపూర్వక పోటీకి ఒప్పుకుంటారని, అందులో భాగంగా బీ–ఫారం దక్కుతుందని అంచనా వేశారు. కొందరు అగ్రనేతలు ఇచ్చిన భరోసాతో అట్టహాసంగా సోమవారం నామినేషన్‌ వేయాలని భావించారు.

ఆయన అంచనాకు అనుగుణంగా పెద్దఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు నియోజకవర్గ కేంద్రానికి తరలివచ్చాయి. మహాకూటమికి సీటు కేటాయించినా కాంగ్రెస్‌ బీఫారం తనకే వస్తుందని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లేవరకు ప్రకటించిన మల్‌రెడ్డి ఆఖరికి బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు. కాగా, ఇండిపెండెంట్‌గా కూడా నామినేషన్‌ దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. మల్‌రెడ్డికే టికెట్‌ అని నమ్మించి చివరికి రాకపోవడంతో కార్యకర్తలు ఊసూరుమన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top