కేటీఆర్‌ ట్వీట్‌ కొండంత అండనిచ్చింది: గువ్వల బాలరాజు

I Will Fight For Save Nallamala Says Guvvala Balaraj - Sakshi

నల్లమల్లపై ప్రాణమున్నంత వరకు పోరాడుతా

ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

కేసీఆర్‌ స్ఫూర్తితో మరో ఉద్యమం చేస్తాం

యూరేనియం తవ్వకాలపై ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

సాక్షి, హైదరాబాద్‌: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్‌తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై  కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

ఆయన మాట్లాడుతూ..‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్‌లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్‌కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top