
ప్రకాశ్‌నగర్ పాకెట్ పార్కింగ్ వద్ద నిలిచిపోయిన మెట్రోరైలు (లేటెస్ట్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఉత్సాహంగా రైలు యాత్ర చేద్దామని వచ్చిన నగరవాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నాగోల్-అమీర్‌పేట్ మార్గంలో.. ఆదివారం ఉదయం సుమారు రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సర్వీసుల నిలిపివేతకు సంబంధించి కనీస సమాచారం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
రైలు నిలిపివేత : నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు బయలుదేరిన ఒక సర్వీసులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ రైలును ప్రకాశ్‌నగర్ పాకెట్ పార్కింగ్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు టెర్మినళ్ల వద్దా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే టికెట్లు కొనుక్కుని ఫ్లాట్‌ఫామ్స్‌పైకి వచ్చిన ప్రయాణికులు.. ఎంతకీ రైళ్లు కదలకపోవడంతో కంగారుపడ్డారు. టికెట్ డబ్బులు తిరిగి ఇస్తారో, లేదో తెలియని అయోమయస్థితిలో వేరే మార్గాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. మైట్రో రైలు నిలిపివేతకు సంబంధించి అధికారుల స్పందన వెలువడాల్సిఉంది.