ఎస్సారెస్పీకి భారీ వరద | Huge Flood Water Inflow in SRSP | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి భారీ వరద

Jun 13 2018 1:25 AM | Updated on Aug 1 2018 4:01 PM

Huge Flood Water Inflow in SRSP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం దిగువ ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తోంది. మంగళవారం సాయంత్రానికి 21,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.197 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజులు ప్రవాహాలు కొనసాగుతాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక స్థాయిలో ప్రవాహాలు కొనసాగుతున్నాయి.

సింగూరుకు మంగళవారం 1,442 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా, 29.91 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. కడెంలోకి 2,492 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 1,611 క్యూసెక్కుల మేర వస్తోంది. నిజాంసాగర్, లోయర్‌ మానేరు డ్యామ్‌ పరిధిలోకి ఇంకా ఎలాంటి ప్రవాహాలు మొదలు కాలేదు. కృష్ణా బేసిన్‌లో ఒక్క జూరాలకు మాత్రమే మెరుగైన ప్రవాహాలు వస్తున్నాయి. పరీవాహకంలో కురిసిన వర్షాలతో మంగళవారం 3,903 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఈ సీజన్‌లో వర్షాలు మొదలయ్యాక గరిష్టంగా జూరాలకే 1.28 టీఎంసీల కొత్తనీరు వచ్చి చేరింది. ఇక నాగార్జునసాగర్‌లోకి 512 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ఎలాంటి ప్రవాహాలు లేకపోగా, నారాయణపూర్‌కు 599 క్యూసెక్కులు, తుంగభద్రకు 1,127 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరితే కానీ దిగువకు ప్రవాహాలు కొనసాగే పరిస్థితి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement