సింగరేణి అధికారుల గృహ నిర్బంధం

House Arrest Of Singareni Officials - Sakshi

కోల్‌బెల్ట్‌ : జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధి ఓసీపీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వాసితులు జీఎంతోపాటు వెంట వచ్చిన అధికారులను గృహ నిర్భంధం చేశారు. కేటీకే ఓసీపీ-2లో బ్లాస్టింగ్‌ల కారణంగా సమీపంలోని ఆకుదారివాడకు చెందిన దుర్గం రజిత ఇంటిపై రాళ్లు పడగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీఎంతోపాటు ఎస్‌ఓటూ జీఎం పద్మనాభరెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్‌ జాన్‌ ఆనంద్, సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుకర్‌ గురువారం గ్రామాన్ని సందర్శించారు.

రజితకు సంబంధించిన ఇంటిలోపలికి వెళ్లి పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఓసీపీ నిర్వాసితులు అధికారులను రెండు గంటల పాటు ఇంటిలోనే నిర్భంధించారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చిస్తామని జీఎం గురువయ్య హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఓసీపీ సమీపంలోని సుమారు 800 ఇళ్ల విషయంలో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయటం లేదన్నారు.

అలాగే బ్లాస్టింగ్‌లతో బండరాళ్లు పడి ఇళ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆకుదారివాడకు చెందిన సెగ్గెం లక్ష్మి, చిన్న రాజయ్య, చిన్న సమ్మయ్య ఇళ్లు, బుధవారం దుర్గం రజిత ఇల్లు ధ్వంసమైందని, ప్రాణాపాయం పొంచి ఉందని తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.

తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జీఎం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని, ఇళ్లపై రాళ్లు పడటం దురదృష్టకరమన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top