‘బీ గ్రేడ్‌’తో అధిక ఆదాయం 

High Revenue for Singareni Through B Grade Coal - Sakshi

భూపాలపల్లిలో 6.27 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం 

సింగరేణి సంస్థకు ఏటా రూ.9 కోట్ల రాబడి

బహిరంగ మార్కెట్‌లో     టన్ను బొగ్గుకు రూ.3,885

కోల్‌బెల్ట్‌(భూపాలపల్లి జిల్లా): సింగరేణివ్యాప్తంగా బీ గ్రేడ్‌కు బొగ్గు ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. భూపాలపల్లి ప్రాంత గనుల్లో ఈ రకం బొగ్గు ఎక్కువగా లభిస్తోంది. వినియోగదారులు కూడా ఈ ఏరియా బొగ్గుపైనే ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఏటా 4.5 లక్షల టన్నుల బొగ్గు విక్రయం జరపటం ద్వారా సంస్థకు రూ. 9 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతున్నది. భూపాలపల్లి ఏరియాలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆయా గనుల ద్వారా 34.40 లక్షల టన్నులను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. అందులో కేటీకే 1,5,8 గనుల్లో 4 లక్షల టన్నుల చొప్పున లక్ష్యం నిర్దేశించగా కేటీకే–6లో 2.40 లక్షలు, కేటీకే ఓసీపీ–2లో 15 లక్షలు, కేటీకే ఓసీపీ–3లో 5 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని టార్గెట్‌ విధించారు. అందులో నాణ్యమైన బీ గ్రేడ్‌ అనగా జీ–5 బొగ్గు 6.27 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుందని అధికారుల అంచనా. మిగతాది జి–11 బొగ్గు. బహిరంగ మార్కెట్‌లో జీ–5 బొగ్గుకు టన్ను ధర రూ.3885 ఉండగా జీ–11 బొగ్గుకు టన్ను ధర రూ. 1820 ఉంది.  

ఏరియాలో 6.27 లక్షల టన్నుల ఉత్పత్తి.. 
భూపాలపల్లి ఏరియాలోని గనులలో నాణ్యత కలిగిన బీ గ్రేడ్‌ బొగ్గు 6.27 లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా గత ఏడాదితో పోల్చి నిర్ణయం తీసుకున్నారు. కేటీకే–1లో 2.0 లక్షలు, కేటీకే–5లో 2.0 లక్షలు, కేటీకే–6లో 50 వేలు, కేటీకే–8లో 70 వేలు, కేటీకే ఓసీపీలో 1,07,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. నిర్దేశించిన లక్ష్యంలో 4.50 లక్షల టన్నులను మాత్రమే వినియోగదారులకు విక్రయించే అవకాశముంది. అందులో కేటీపీపీకి ఏటా 50 వేలు, మిగిలిన నాలుగు లక్షల టన్నులు కేశోరాం, అంజనీ, భవ్య, డక్కన్, కీర్తి, మైహోం, ఎన్‌సీఎల్, ఓరియంట్, రేయిన్, కేసీపీ, ఎంటైర్‌ సిరామిక్స్, అబిజిత్‌ ఫెర్రోటెక్, నవభారత్‌ ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. ఇందులో ఇప్పటికే పలు కంపెనీలు బొగ్గు కోసం సింగరేణి సంస్థతో లింకేజీ కుదుర్చుకున్నాయి.

ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందం ప్రకారం 2,99,000 టన్నుల బీ గ్రేడ్‌ (జీ5) బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో కేటీపీపీ జీ–5 గ్రేడును అదనంగా కొనుగోలు చేసింది. జీ–11 బొగ్గు ధర కన్నా జీ–5 గ్రేడు బొగ్గుకు టన్నుకు అదనంగా రూ. 2 వేలు ఉండటంతో 4.5 లక్షల టన్నులకు రూ. 9 కోట్లు ఆదాయం సమకూరుతున్నది. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి అవుతున్న జీ–5 గ్రేడు బొగ్గును కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సంస్థకు సైతం అదనపు ఆదాయం సమకూరుతుంది. నాణ్యత కలిగిన బొగ్గును కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఏరియా జనరల్‌ మేనేజర్‌ నిరీక్షణ్‌రాజ్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top