దద్దరిల్లనున్న ధర్నాచౌక్‌ 

High Court Judgement Over Dharna Chowk Issue - Sakshi

అక్కడ నిరసనలపై ప్రభుత్వ నిషేధాన్ని తప్పుబట్టిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసనలను ప్రభుత్వం నిషేధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిరసన గళం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, అటువంటి నిరసన గళాన్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమావేశమయ్యే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, సహేతుక ఆధారాలు లేకుండా ఈ హక్కులపై ఏకపక్ష ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని తేల్చి చెప్పింది.

ధర్నాచౌక్‌ కాకుండా నిరసన కార్యక్రమాల నిర్వహణకు వేదికగా సరూర్‌నగర్‌ స్టేడియాన్ని ఎంపిక చేశామని, అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా తమకు ఇబ్బంది లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోలాగే ధర్నాచౌక్‌ను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే నిరసనల నిర్వహణ సమయంలో అర్థవంతమైన ఆంక్షలు విధించవచ్చని పోలీసులకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆరు వారాలపాటు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టేందుకు తమ ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం లైసెన్స్‌ కాదని తేల్చి చెప్పింది. 

స్థానికులకు ఇబ్బంది అవుతోందనే... 
ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు ఇదే అంశంపై  విశ్రాంత ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాల్లో కాంగ్రెస్‌ నేత నగేష్‌ ముదిరాజ్‌ ఇదే అభ్యర్థనతో ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌. శరత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు చేపడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ఇందిరాపార్క్‌ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయని, నిరసనల వల్ల భారీగా ట్రాఫిక్‌ సమస్య కూడా ఏర్పడుతోందన్నారు. అంతేకాక ఆ ప్రాంతం అత్యధిక జనసాంద్రతగల ప్రాంతమని వివరించారు. అందుకే సరూర్‌నగర్‌ స్డేడియాన్ని ధర్నా చౌక్‌గా గుర్తించామని, అక్కడ నిరసనలు చేపట్టేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. 

ఆ గళాల వల్లే ప్రజాస్వామ్య బతికిబట్టకడుతోంది... 
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారు అంతేనా? జనాలు ఉన్న చోట కాకుండా అడవుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలా? ఇంట్లో ఏడుస్తున్న పిల్లాడిని పైగదిలోకి వెళ్లి ఏడువు అన్నట్లు మీ వాదన ఉంది. నిరసనల వల్ల ఇబ్బంది ఉంటే అర్థవంతమైన ఆంక్షలు విధించండి. పరిమితులు, షరతులతో అనుమతులివ్వండి. అంతేకానీ నిరసన గళాలు వినిపించకుండా చేస్తామంటే ఎలా? ఇంకా ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోందంటే ఈ నిరసన గళాలే కారణం. ఇవే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఇవి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ట్రాఫిక్‌ సమస్య ఉంటే వేల సంఖ్యలో రిజిస్టర్‌ అవుతున్న కార్ల సంఖ్యను వాటిని వందల సంఖ్యలోకి తీసుకురండి’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తిరిగి శరత్‌ వాదనలు వినిపిస్తూ ధర్నాచౌక్‌ వద్ద అనుకోని ఘటన ఏదైనా జరిగితే బయటపడటం కష్టమని పేర్కొనగా ఇప్పటివరకు అటువంటి ఘటనలు ఎన్ని జరిగాయని ధర్మాసనం ప్రశ్నించింది. 

‘ప్రైవేటు’కోసం నిరసనలను అడ్డుకోమంటారా?! 
‘ఆ చుట్టుపక్కల అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఎవరు ఇవ్వమన్నారు? అన్ని విద్యా సంస్థలకు అనుమతులు ఎందుకిచ్చారు. ఇందులో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి? ఎన్ని ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలన్నది రాజ్యాంగకర్తల ఆలోచన. అయితే ఇప్పుడు అంతా ప్రైవేటుమయం అయిపోయింది. అందుకు మీరు చెబుతున్న ఉదాహరణలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కోసం నిరసన గళాలను అడ్డుకోమంటారా? ఈరోజు ధర్నాచౌక్‌ వద్ద నిరసనలు చేపట్టడానికి వీల్లేదంటారు. రేపు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలని కూడా నిర్ధేశిస్తారు. మీ (ప్రభుత్వ) వాదనతో మేం ఎంత మాత్రం ఏకీభవించడం లేదు’అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల అనంతరానికి ఈ వ్యాజ్యాలను వాయిదా వేయాలని, ఇప్పుడు ధర్నాచౌక్‌ వినియోగానికి అనుమతినిస్తే ఎన్నికల సమావేశాలన్నీ అక్కడే జరుగుతాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌ పేర్కొనగా ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ధర్నాచౌక్‌ వద్ద పరిస్థితి ఏమిటని ధర్మాసనం ఆరా తీయగా వీహెచ్‌ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ అక్కడ ప్రైవేటు టూరిస్ట్‌ ఆపరేటర్లు తమ బస్సులను పార్కింగ్‌ చేస్తున్నారన్నారు. 

ఆ హక్కు ఎందుకు లేదు..? 
ఈ సమయంలో నిరసన తెలియచేసే ప్రాంతాన్ని ఎంచుకునే హక్కు ఆందోళనకారులకు లేదని శరత్‌ వాదించగా ఎందుకు లేదని ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు ఈ దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో చాడ వెంకటరెడ్డి తరఫు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్, వీహెచ్‌ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ గత 20 ఏళ్లుగా ధర్నాచౌక్‌ కొనసాగుతోందని, ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, ఒకవేళ ఏవైనా జరిగి ఉంటే అవి పోలీసుల అత్యుత్సాహం వల్లే జరిగాయన్నారు. ఈ సమయంలో ఇంప్లీడ్‌ పిటిషనర్‌ నగేష్‌ ముదిరాజ్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ రాజకీయ పార్టీలే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి అక్కడ దివ్యాంగులు, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, చిరుద్యోగులూ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

అదే చీఫ్‌ జస్టిస్‌ బంగ్లాకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తారు... 
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘ధర్నా చౌక్‌కు ఒక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు నేను మా కారు డ్రైవర్‌ను ధర్నా చౌక్‌ వద్దకు తీసుకెళ్లమంటే నేరుగా తీసుకెళ్తాడు. అదే ఓ ఆటో డ్రైవర్‌ను నన్ను చీఫ్‌ జస్టిస్‌ బంగ్లా వద్దకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తాడు. అది ఎక్కడుందని అడుగుతాడు. తాజ్‌కృష్ణకు సమీపంలో ఉందని, అక్కడి నుంచి ముందుకెళ్లి ఎడమ వైపు తిరిగి చీఫ్‌ జస్టిస్‌ బంగ్లా వస్తుందని చెప్పినా కూడా నేరుగా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ధర్నా చౌక్‌ పరిస్థితి అది కాదు. దానికున్న గుర్తింపు అలాంటిది’అంటూ వ్యాఖ్యానించింది. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ ధర్నాచౌక్‌ను గతంలోలాగా వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top