
భానుడి భగభగ
రాష్ట్రంపై ప్రచండ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రత ప్రజలను బలితీసుకుంటూనే ఉంది. ఎండలకుతోడు తీవ్ర ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే ఆదివారం మొత్తంమీద ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గినా వడగాలుల ప్రభావం మాత్రం కొనసాగింది.
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత
- నల్లగొండలో 45.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 249 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంపై ప్రచండ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రత ప్రజలను బలితీసుకుంటూనే ఉంది. ఎండలకుతోడు తీవ్ర ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే ఆదివారం మొత్తంమీద ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గినా వడగాలుల ప్రభావం మాత్రం కొనసాగింది. నల్లగొండలో 45.4 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా రామగుండం, నిజామాబాద్‌లలో 45, మహబూబ్‌నగర్‌లో 44, ఆదిలాబాద్‌లో 43.3, వరంగల్‌లో 43, కంపాసాగర్‌లో 42.9, అశ్వారావుపేటలో 42.6, జగిత్యాలలో 42.2, హైదరాబాద్‌లో 41.5, రుద్రూర్‌లో 41.3, సంగారెడ్డిలో 40.7, తాండూరులో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏరియాలోని శ్రీరాంపూర్, మందమర్రి, డోర్లి, కైరిగూడలలో 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు తాళలేక మధ్యాహ్నం విధులుకు హాజరయ్యే కార్మికుల సంఖ్య తగ్గుతుండటం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బకు తాళలేక రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 251 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలవారీగా చూస్తే వరంగల్ జిల్లాలో అత్యధికంగా 57 మంది మృతిచెందగా ఖమ్మం జిల్లాలో 46 మంది, నల్లగొండ జిల్లాలో 42 మంది, కరీంనగర్ జిల్లాలో 41 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 13 మంది, మెదక్ జిల్లాలో 11 మంది, రంగారెడ్డి జిల్లాలో 10 మంది, నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది మంది, హైదరాబాద్‌లో ఆరుగురు మరణించారు.
ఏపీలో 470 మంది మృతి
సాక్షి, విజయవాడ బ్యూరో/విశాఖపట్నం/చీరాల రూరల్: సూర్య ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ అగ్నిగోళంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 470 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఓ విదేశీయుడు కూడా ఉన్నాడు. చీరాల వాడరేవులోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్న గ్రావినా హెక్టర్ ఓమర్ (63) అనే అర్జెంటీనా జాతీయుడు వడదెబ్బకు తాళలేక మరణించాడు. గత కొన్నేళ్లలో ఎన్నడూ 40 డిగ్రీలు దాటని విశాఖ నగరంలోనూ ఆదివారం రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలవారీగా చూస్తే ప్రకాశం జిల్లాలో 83 మంది, కృష్ణా జిల్లాలో 63 మంది, గుంటూరు, నెల్లూరులలో 60 మంది చొప్పున మృతి చెందారు. వాయువ్య గాలుల వల్ల ఉష్ణ తీవ్రత, వడగాలులు కొనసాగుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఎండలు విజృంభించే అవకాశం ఉందంటున్నారు.