
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2019కు వెళ్లాలనుకునేవారు ఈ నెల 18 నుంచి హజ్ కమిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టినట్లు పేర్కొన్నారు. నవంబర్ 17వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందన్నారు. పాస్‌పోర్టు గడువు 2018, నవంబర్ 17కు ముందు నుంచి 2020, జనవరి 31 వరకు ఉండాలన్నారు.
దరఖాస్తు చేసుకున్నవారిని డ్రా పద్ధతిలో హజ్‌యాత్రకు ఎంపిక చేస్తారని, డిసెంబర్ చివరివారంలో డ్రా ఉంటుందన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరన్నారు. దరఖాస్తుతోపాటు ఎస్‌బీఐ ద్వారా రూ.300 చెల్లించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే 040 2329 8793 నంబర్ లేదా కేంద్ర హజ్ కమిటీ వెబ్‌సైట్ www.hajcommittee.gov.inద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.