షీఈజ్‌... స్పెషల్‌ | Gul Panag Special Interview | Sakshi
Sakshi News home page

షీఈజ్‌... స్పెషల్‌

Mar 20 2018 8:13 AM | Updated on Sep 17 2018 5:18 PM

Gul Panag Special Interview - Sakshi

ఆమె దృష్టిలో అపజయానికి, లక్ష్యానికి, ఆలోచనా దృక్పథానికి అర్థాలు వేరు..అందుకే అందరిలా ఆమె ఆలోచించదు. అలాంటి దృక్పథమే ఆమెను విభిన్న రంగాల్లో రాణించేలా చేసింది. ఎంచుకున్న రంగంలో తనకున్న లక్ష్యాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంది..తాను నమ్మే సిద్ధాంతంతో సక్సెస్‌ మంత్ర సాధిస్తున్నది. క్రీడలు, మోడలింగ్, సినీ, రాజకీయ రంగం, వ్యాపారం ఇలా వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న గుల్‌ పనాగ్‌ సోమవారం ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో ‘డీకోడింగ్‌ ది సక్సెస్‌ మంత్ర’  పేరిట నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు...    

ఆమె అందరిలా ఆలోచించదు. జయమా.. అపజయమా? అస్సలుపట్టించుకోదు. లక్ష్యమే శ్వాసగా ముందుకెళ్తుంది. ఫలితమేదైనాస్వీకరిస్తుంది. అదే ఆమె సక్సెస్‌ సీక్రెట్‌.. ఆమే గుల్‌ పనాగ్‌. ఈమె మాజీ మిస్‌ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్‌. ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన పనాగ్‌... ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో సోమవారం నిర్వహించిన ‘డీకోడింగ్‌ ది సక్సెస్‌ మంత్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగాముచ్చటించారు. ఆ విశేషాలుఆమె మాటల్లోనే...  

బంజారాహిల్స్‌: మా స్వస్థలం చండీగఢ్‌. నాన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ కావడంతో వివిధ ప్రాంతాల్లో నా చదువు కొనసాగింది. పంజాబ్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఇన్‌ మ్యాథమేటిక్స్, తర్వాత పొలిటికల్‌ సైన్స్‌ చేశాను.  నాకు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి. స్విమ్మింగ్, బంగీ జంప్, స్క్వాష్‌లో ప్రమేయం ఉంది. గ్రూప్‌ డిస్కషన్‌లో జాతీయ స్థాయిలో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాను. అంతే కాకుండా ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా పొందాను. దీన్ని చాలామంది ఏదో పెద్దగా చూస్తున్నారు. నిజానికి ఇది చాలా చిన్న విషయం. అమెరికాలో పదో తరగతి పూర్తి చేసినవారు సైతం ఇలాంటి లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి మహిళకు అవకాశాలు ఉంటాయి. వాటిని మనమే ఎంచుకోవాలి. దేనికీ ప్రత్యేకంగా పరిమితులనేవి ఏమీ ఉండవని అందరూ గుర్తించుకోవాలి.   

మోడలింగ్‌ టు సినిమా...  
ఓ రోజు టీవీలో నఫీసా జోసెఫ్‌ షో చూశాను. అప్పు డే మోడలింగ్‌ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. 1999లో మిస్‌ ఇండియా టైటిల్‌ సాధించాను. అందులో ‘మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌’ సొంతం చేసుకున్నాను. అయితే ఈ రంగంలో జయాపజయాలను సమానంగా స్వీకరించాను. అదే నన్ను విభిన్న వేదికల్లో పాల్గొనేలా చేసింది. మోడలింగ్‌లోకి ప్రవేశంతో సినిమా అవకాశా లు తలుపు తట్టాయి. 2003లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు 15 సినిమాల్లో నటించాను. నేను నటించే సినిమాలు ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం.  

రాజకీయ పరంగాఎంతో నేర్చుకున్నా...    
మోడలింగ్, సినీ రంగంలో కొనసాగుతున్న నా జీవితం అనుకోకుండా రాజకీయంగా మలుపు తిరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి చండీగఢ్‌లో పోటీ చేశాను. అయితే విజయం పక్కనపెడితే రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాను. నామినేషన్‌ మొదలు పోల్‌ మేనేజ్‌మెంట్, బూత్‌ కమిటీ, ఓట్‌ మేనేజ్‌మెంట్‌... ఇలా అన్నీ తెలుసుకునే అవకాశం దక్కింది. ఎన్నికల సమయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారం చేసేదాన్ని. దాదాపు మూడుసార్లు ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగాను. నేను ఫిట్‌గా ఉండడంతోనే ఇది సాధ్యమైంది. మరో విషయం ఏమిటంటే.. ప్రచారం సందర్భంగా గేర్లున్న బైక్‌నే వాడాను. అప్పటి వరకు చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు గేర్ల బైక్‌ నడపడంలో ఇబ్బందులు ఉంటాయని వారించేవారు. అయితే నా ప్రచార శైలి చూసి తల్లిదండ్రుల్లో మార్పొచ్చింది.  

అదేముసుగొద్దు..
రాజకీయంగా గానీ మరేదైనా రంగంలో గానీ.. ఓటమి పాలైతే అదే ముసుగులో ఉండడం మంచిది కాదు. నేను ఎన్నికల్లో ఓడిన తర్వాత అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పరుగు పెట్టాను తప్ప.. అపజయం వెనక పరుగు పెట్టలేదు. మనకు లభించే అవకాశాల్లో లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా వాటిని మలచుకోవాలి. అందుకే జయాపజయాలు ఏవైనా స్వీకరించి, మన జీవితంలో భాగంగా వాటిని గుర్తించాలి. మన జీవితం మనం ఆలోచించే తీరులో ఉంటుందని గుర్తించాలి. అందుకే.. నా జీవితం నాకు ఇష్టమైన, అందమైన రూపంలో నడుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement