జూలై మొదటి వారంలో గ్రూప్‌–2 ఇంటర్వ్యూ

Group II Interviews Will Be In The First Week Of July Says TSPSC - Sakshi

1,032 పోస్టులకు 2,064 మంది ఎంపిక

రెండు రోజుల్లో జాబితా విడుదల 

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడి

గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఇంటర్వ్యూలను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే ఉపాధ్యాయ నియామకాల ఎంపిక చేపట్టామని, ఆ జాబితాను విద్యాశాఖకు పంపించామని పేర్కొన్నారు. చక్రపాణి నేతృత్వంలోని కమిషన్‌ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ 2017–18 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయనకు అందజేసింది.

టీఎస్‌పీఎస్సీ చేపడుతున్న సంస్కరణలపైనా గవర్నర్‌కు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీలో సిబ్బంది నియామకం, భవనాల కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. టీఎస్‌పీఎస్సీలో వార్షిక కేలండర్‌ అమలు, గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ తదితర అంశాలను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రూప్‌–2 నియామకాలకు సంబంధించిన వివరాలపైనా ఆరా తీశారు. గ్రూప్‌–1కు సంబంధించి జోన్లవారీగా పోస్టుల విభజనకు సర్కారు కసరత్తు చేస్తోందని ఆయనకు వివరించినట్టు తెలిసింది.  

రెండు నెలలపాటు ఇంటర్వ్యూలు... 
ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేకుండా సమగ్రమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు నియామకాలు పూర్తిచేస్తున్నందున టీఎస్‌పీఎస్సీని గవర్నర్‌ అభినందించారని కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌–2లో 1,032 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనవారి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, జూలై మొదటివారంలో ఇంటర్వ్యూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2,064 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

ఇప్పటివరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. మొత్తం 39,659 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అందులో 3,186 పోస్టులకు ఆయా శాఖల నుంచి క్లియరెన్స్‌ రావాల్సి ఉందన్నారు. 128 గ్రూప్‌–2 పోస్టులు మినహా 36,474 పోస్టులను నోటిఫై చేశామని, అందులో 26,259 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. 3,494 పోస్టుల మెరిట్‌ æజాబితాలను విడుదల చేశామని, అవి సర్టిఫికెట్ల పరిశీలన వంటి వివిధ దశల్లో ఉన్నాయని చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు సి.విఠల్, సాయిలు, మతీనుద్దీన్‌ ఖాద్రీ, కమిషన్‌ కార్యదర్శి వాణిప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top