114 స్కూళ్లకు మంగళం..?

Govt Schools Closing In Telangana Government - Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: అంతా ఊహించినట్లే జరుగుతోంది.. పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. తద్వారా గ్రామీణ పేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారనుంది. స్కూళ్లు మూతపడి మిగులుబాటుగా మారే ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళం కానుంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయకుండా విద్యార్థులు రావడం లేదన్న సాకుతో రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూసి ప్రభుత్వ విద్యకు మంగళం పాడేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపడితే విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలు కనుమరుగు కానుండగా, ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి, వేరే ప్రభుత్వ శాఖల్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ  కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ నెల 11న డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల రేషనలైజేషన్‌ ప్రక్రియ గురించి వివరిస్తూనే ఉన్న ఫలంగా సమాచారాన్ని పంపించాలని కోరడంతో మళ్లీ పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేస్తూ తక్కువగా ఉన్న పాఠశాలల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉంటాయో.. ఎన్ని మూతపడుతాయో తెలియని గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరుగా ఉత్తర్వులు జారీ అయితే జిల్లాలో 114 పాఠశాలలు మూతబడనున్నాయి. బడిబాట కార్యక్రమం ముగిసేలోగా పక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించడంతో జూన్‌ 19లోగా పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయి ఒకే గ్రామంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అదే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి.. 
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 650 ఉన్నాయి. 37,773 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 60 వరకు ఉన్నట్లు యుడైస్‌ నివేదికలో వెల్లడయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 20లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 16 వరకు ఉన్నాయి. 30లోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు 16 నుంచి 20 వరకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తే జిల్లాలో 114 పాఠశాలలు మూతపడుతాయి. యూపీఎస్‌లలో సైతం 30మంది లోపు ఉన్న వాటిని సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని బాలికలు సమీప ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో బాలికల విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో వేసవి సెలవుల్లో రేషనలైజేషన్‌ పేరిట చేసిన సంస్కరణల్లో ఇప్పటికే జిల్లాలో 850 మంది ఎస్‌జీటీలు మిగులుగా ఉండి డీఈఓ ఆధీనంలో ఉండడంతో వారిని జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సర్దుబాటు చేసి ఈ విద్యా సంవత్సరం మమ అనిపించారు. తాజాగా మళ్లీ 114 స్కూళ్లు మూతపడితే మిగులుబాటుగా ఉండే ఎస్జీటీలను ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే తెల్చాల్సి ఉంది.
 
నిరుద్యోగుల ఆశలు ఆడియాశలే...
టీచర్‌ పోస్టు కొట్టాలనుకుంటున్న నిరుద్యోగుల్లో బడుల హేతుబద్ధీకరణ నిర్ణయం నిరాశ వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకొని టీచర్‌ జాబ్‌కొట్టాలనే టీఆర్‌టీ అభ్యర్థుల భవిష్యుత్‌ ప్రశ్నార్థకమైంది. రేషనలేజేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు మిగులే పరిస్థితి ఉంటుందనే భావన అందరిలో ఉండడంతో టీఆర్‌టీ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.  

ఉత్తర్వులు అందలేదు...
ఇటీవల జరిగిన వీడియో కాన్పరేన్స్‌లో పాఠశాలల హేతుబద్ధీకరణ విషయంపై చర్చ జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందాల్సి ఉంది. గతంలో సూచించిన విధంగా జిల్లాలో విద్యార్థుల, పాఠశాలల పరిస్థితిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా సహకరిస్తే సాధ్యమవుతుంది. రేషనలైజేషన్‌ జీవో అందాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఈవో

ప్రభుత్వ నిర్ణయం గర్హనీయం
సంస్కరణల పేరిట విద్యారంగాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగం నుంచి తప్పుకునేందుకే తహతహలాడుతోంది. గ్రామీణ పేద విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన ప్రభుత్వం చట్టానికి తూట్లు పొడుస్తోంది. తరగతి గదికో ఉపాధ్యాయుని నియమించి, బోధన, బోధనేతర, పర్యవేక్షణ సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం విద్యార్థులు లేరని సాకుతో బడులను మూసివేయడం మంచి పరిణామం కాదు – గవ్వ వంశీధర్‌రెడ్డి, ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు 

విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం
ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ఎస్టీయూ వ్యతిరేకం. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బడుల మూసివేత వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకోంది. రేషనలైజేషన్‌ ప్రక్రియను నిలిపివేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ బడులను సంస్కరించాల్సిందిపోయి కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేసే విధంగా వ్యవహరించడం బాధాకరం. – కటుకం రమేశ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి 

పేద విద్యార్థులకు పెనుశాపం...
పాఠశాలల మూసివేత పేద విద్యార్థులకు పెనుశాపంగా మారనుంది. స్వరాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తక్షణమే రేషనలైజేషన్‌ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. – కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్‌జీటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top