కొత్త మెడికల్‌ సీట్లకు కేంద్ర సాయం

Government Given Statement To Medical Education Directors Over PG seats - Sakshi

ప్రతిపాదించాలని వైద్య విద్యా సంచాలకులకు కేంద్రం ఆదేశం

పీజీ మెడికల్‌ సీట్లకు ప్రతిపాదనలు తయారు చేస్తున్న యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు మూడేళ్లలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఒక్కో పీజీ, ఎంబీబీఎస్‌ సీటుకు రూ. 1.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ)ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని వైద్య విద్యా విభాగం ఆదేశించింది. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఆ ప్రకారం ఆయా కాలేజీల్లో మొత్తంగా 600 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయి.

దాంతోపాటు ఈ ఏడాది కేంద్రం అగ్రవర్ణాల్లోని ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు వివిధ కాలేజీల్లో మరో 190 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు చేసింది. ఇవన్నీ కలిపి 790 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్రానికి కొత్తగా వచ్చాయి. వాటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు కలిపి 150 వరకు పీజీ మెడికల్‌ సీట్లు వచ్చాయి. అంటే ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్లు అన్నీ కలిపి 940 మెడికల్‌ సీట్లను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) మంజూరు చేసింది. వీటన్నింటికీ కలిపి రూ. 1,128 కోట్ల ఆర్థిక సాయం కేంద్రం నుంచి రానుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం
మెడికల్‌ సీట్లు పెంచినప్పుడు ఆ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. సీట్లతోపాటు ఆ మేరకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్‌ వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ విస్తరణ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. అందుకోసం కేంద్రం సీట్లు మంజూరు చేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా వచ్చిన పీజీ, ఎంబీబీఎస్‌ సీట్లకు కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వైద్య విభాగం జాయింట్‌ సెక్రటరీ దీనిపై అధికారులను నిలదీశారు. నిధుల కోసం ప్రతిపాదనలు ఎందుకు  పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం
పీజీ మెడికల్‌ సీట్లకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థికసాయానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాక, అక్కడినుంచి కేంద్రానికి వెళుతుంది. మరోవైపు ఎంబీబీఎస్‌ సీట్లకు కేంద్ర సాయం విషయంలో స్పష్టత తీసుకుంటున్నాం. నిబంధనలను పరిశీలిస్తున్నాం. కేంద్ర అధికారి ఎంబీబీఎస్‌ సీట్లకు ఆర్థికసాయం ఉందని చెప్పారు. ఈసారి ఢిల్లీ వెళ్లాక దీనిపై స్పష్టత తీసుకున్నాక ప్రతిపాదనలు తయారు చేస్తాం.
– డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీఎంఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top