‘గాంధీ’లో గద్దలు

Government Ambulance Services Neglect In Gandhi Hospital - Sakshi

మొరాయిస్తున్న ప్రభుత్వ పార్థివ వాహనాలు  

గాంధీలో మూలనపడ్డ ఆరు అంబులెన్స్‌లు

అదే దారిలో మరో నాలుగు

ప్రైవేటు అంబులెన్స్‌ల అడ్డగోలు దోపిడీ

నీరుగారుతున్న పథక లక్ష్యం  

గాంధీఆస్పత్రి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి భౌతిక కాయాలను  స్వస్థలాలకు  ఉచితంగా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం (పార్ధివదేహాల తరలింపు) అధికారుల అలసత్వం, నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా  నీరుగారుతోంది. మృతదేహాల తరలింపు అనివార్యం కావడంతో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు ‘రింగ్‌’గా ఏర్పడి నిరుపేదలను దోచుకుంటున్నారు. తెలంగాణ వైద్యప్రదాయినిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి కేటాయించిన పది పార్థివ వాహనాల్లో ఆరు వాహనాలు రెండునెలల క్రితమే మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. మిగిలిన నాలుగు వాహనాలు కండీషన్‌ సరిగా లేక ఏ క్షణమైనా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని  అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మృతదేహాలను తరలించేందుకు  ప్రైవేట్‌ అంబులెన్స్‌లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియా నుంచి పేదలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 నవంబర్‌ 18న ‘హెర్సే’ పేరిట మార్చురీ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినవారి పార్థివదేహాలను ఆయా వాహనాల్లో ఉచితంగా స్వస్థలాలకు చేరవేస్తారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పది ‘హెర్సే’ వాహనాలను కేటాయించింది. గత కొన్ని నెలలుగా ఆరు వాహనాలు మూలనపడ్డాయి. మిగిలిన నాలుగు కూడా తరచూ బ్రేక్‌డౌన్‌ కావడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియలో గందరగోళంగా మారింది. దీనికితోడు  వాహనాల్లోని ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వెలువడుతోంది.  వివిధ కారణాలతో  గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 15 మంది మృతి చెందుతుంటారు. ఆయా మృతదేహాలను తరలించేందుకు తగినన్ని వాహనాలు అందుబాటులో లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు అంబులెన్స్‌ యాజమాన్యాలు కుమ్మక్కై అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 

పాత వాహనాలతోనే..
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో హెర్సే వాహనాలను డిప్యూటీ సీఎం మెహమూద్‌ఆలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులతో కలిసి  వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మూలనపడ్డ పాత వాహనాలకు కొద్దిపాటి మరమ్మతులు చేసి పెయింటింగ్‌ వేసి అందుబాటులోకి తెచ్చినట్లు అప్పట్లో మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అయితే మృతదేహాల తరలింపునకు ఈ మాత్రం కండీషన్‌ సరిపోతుందని వైద్యశాఖమంత్రి వెనకేసుకొచ్చారు. వాహనాల నిర్వహణ సంస్థ పనితీరుపై కూడా  ఆస్పత్రివర్గాల్లో అసంతృప్తి నెలకొందని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు. తక్షణమే వైద్యశాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి హెర్సే వాహనాలను అందుబాటులోకి తేవాలని నిరుపేదలు కోరుతున్నారు.

ప్రభుత్వానికి లేఖలు రాశాం
పార్థివ దేహాలను తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన హెర్సే వాహనాలు తగినన్ని అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఆస్పత్రికి పది వాహనాలు కేటాయించగా, వాటిలో ఆరు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి, మిగిలిన నాలుగు వాహనాల కండీషన్‌ సరిగాలేదు. వాహనాల నిర్వహణ సంస్థతో నేరుగా చర్చించే అవకాశం లేకపోవడంతో ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాశాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం.   – శ్రవణ్‌కుమార్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top