
2013 చట్టాన్ని అమలు చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా 2013 చట్టాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
• డీపీఆర్ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి?
• నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాకే పనులు చేపట్టాలి
• వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా 2013 చట్టాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశా రు. భూసేకరణ సందర్భంగా జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు రైతు దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో ఇష్టారీతిగా అంచనాలు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతోందన్నారు. ఇంత వరకు డీపీఆర్ సిద్ధం చేయకుండా రైతుల నుంచి భూములు సేకరించడం ఎంతవరకు సబబని ప్రశించారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల వల్ల భూమి, భుక్తి కోల్పో యే రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మల్లన్నసాగర్ తరహా ఉద్యమం వస్తుందని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
వైఎస్సార్ పేరు చెప్పకపోవడం సరికాదు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారీ ఎత్తున ప్రాజెక్టులు కట్టి, రైతుల పొలాల్లోకి నీరు పంపింది.. ఉచిత విద్యుత్ ఇచ్చింది కేవ లం దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమేనని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రాజెక్టులు మేమే కట్టామని చెబు తున్న కాంగ్రెస్ నేతలు, అందుకు కారణమైన జలయజ్ఞ ప్రదాత వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష నిర్వహించారు.