పప్పు ఉడ్కలే!

Free Toor Dal Distribution Delay For No Stock in Ration Shops - Sakshi

రేషన్‌ దుకాణాలకు చేరని సరుకు  

వారం రోజుల తర్వాతే పంపిణీ

నేటినుంచి ఉచిత బియ్యం అందజేత

సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుదారులకు ఈ నెల మొదటి వారంలో ఉచిత కంది పప్పు పంపిణీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కందిపప్పు కోటా సరఫరా జరగలేదని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల ఉచిత బియ్యంతో పాటు అదనంగా కందిపప్పు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్‌ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కంది పప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాలను కేటాయించింది. ఇప్పటికే ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు బియ్యం, గోధుమలు, చక్కెర కోటా సరఫరా జరిగినా.. కందిపప్పు కోటా ఇంకా సరఫరా జరగలేదని డీలర్లు పేర్కొంటున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఉచిత కందిపప్పు కోటా కేటాయించినా.. మార్క్‌ఫెడ్‌ నుంచి పౌర సరఫరాల గోదాములకు కందిపప్పు సరఫరా నత్తకు నడక నేర్పిస్తోంది. పూర్తి స్థాయిలో కంది పప్పు కోటా గోదాములకు చేరే సరికి మరో రెండు మూడు రోజులు పడుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక గోదాముల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సరఫరా   జరిగి పంపిణీ ప్రారంభమయ్యే సరికి  మరి కొంత అలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కిలో చొప్పున పంపిణీ..  
ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుకు ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు పంపిణీ జరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ. 105 నుంచి రూ.120 వరకు పలుకుతోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత  పంపిణీ కారణంగా కంది పప్పు కోసం డిమాండ్‌ అధికంగానే ఉంటోంది. మొదటి వారంలో కంది పంపిణీ సరఫరా లేని కారణంగా లబ్ధిదారులకు  కేవలం ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కంది పప్పు సరఫరా తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఆహార భద్రత కార్డు దారులు  మొదటి వారంలో ఉచిత బియ్యం కోటాను తీసుకున్నా.. ఆ తర్వాత ఉచిత కంది పప్పు కోటాను డ్రా చేసుకోవచ్చని  పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కందిపప్పు పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

16లక్షలకుపైగా కుటుంబాలకు..  
గ్రేటర్‌ పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన సుమారు 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. గత నెల మాదిరిగానే ఈ నెల కూడా ప్రతి కార్డుదారుల్లోని కుటుంబ సభ్యుడి (యూనిట్‌)కి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. అదనంగా ఈ నెల  కార్డుదారుడికి కిలో చొప్పున ఉచితంగా కందిపప్పు అందిస్తారు. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు పంపిణీ చేస్తారు. మరోవైపు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం గత నెల మాదిరిగానే రూ.1500ను బ్యాంక్‌ ఖాతాలో జమ చేయనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top